గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు (బుధవారం) విచారణ జరిగింది. ఈ కేసు తదుపరి విచారణను జులై 23వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున దాఖలైన పిటిషన్‌పై స్పందించేందుకు ప్రతివాది, కృష్ణలంక మాజీ సీఐ నాగరాజుకు సుప్రీంకోర్టు వారం రోజుల సమయం ఇచ్చింది. కృష్ణలంక మాజీ సీఐ నాగరాజు పోలీస్ కస్టడీకి సంబంధించి హైకోర్టు విధించిన షరతులను సవాల్ చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఏపీ హైకోర్టు తన తీర్పులో నిందితుడి ట్రాన్సిట్ సమయంలో పూర్తి నిడివి వీడియో రికార్డింగ్ చేయాలని, కస్టడీ విచారణలో పలు కఠిన నిబంధనలు పాటించాలని ఆదేశించింది. అయితే ఈ షరతులపై రాష్ట్ర ప్రభుత్వం, సిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిరంతర వీడియో నిఘా కారణంగా దర్యాప్తు గోప్యత దెబ్బతినే అవకాశం ఉందని ఏపీ సర్కార్ తెలిపింది. ఈ కేసు విచారణకు సంబంధించిన కీలక అంశాలు బయటకు వెళ్లే ప్రమాదం ఉందని ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. అదేవిధంగా సాయికృష్ణ మృతదేహం అన్వేషణ, సంఘటన స్థల పునర్నిర్మాణం (సీన్ రికన్‌స్ట్రక్షన్) వంటి కీలక దర్యాప్తు చర్యలకు హైకోర్టు విధించిన నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయని సిట్ అధికారులు వాదించారు. ఈ కేసు పూర్తి స్థాయిలో విచారించేందుకు నిందితుడికి ఎలాంటి కఠిన షరతులు లేకుండా కస్టడీలో ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రతివాది మాజీ సీఐ నాగరాజు నుంచి సమాధానం కోరుతూ విచారణను జులై 23వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. తదుపరి విచారణలో సిట్ అభ్యర్థనపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.