చేయని పనులకు నిధుల ఖర్చు ఎందుకు? బ్రహ్మంగారిమఠం మండలంలో గ్రామపంచాయతీలపై బీజేపీ ఫిర్యాదు

బ్రహ్మంగారిమఠం మండలంలోని గ్రామపంచాయతీల పరిధిలో చేయని పనులకు నిధులను ఖర్చు చేసిన విధానంపై ప్రశ్నలు లేవనెత్తుతూ, భారతీయ జనతా పార్టీ బ్రహ్మంగారిమఠం శాఖ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని శాసనసభ్యుల కార్యాలయంలో నిర్వహించిన PGRS సమావేశంలో ఈ ఫిర్యాదు నమోదు చేశారు.

బ్రహ్మంగారిమఠం మండల అధ్యక్షులు పెద్దిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ, మండలంలోని గ్రామపంచాయతీల నిధుల వినియోగంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2014–15 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన నిధులు అనేక గ్రామాల్లో దుర్వినియోగం అయ్యాయని ఆయన ఆరోపించారు.

పెద్దిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి పేర్కొంటూ, చేయని పనులకు నిధులు ఖర్చు చేసినట్లు చూపించారని, కొన్ని గ్రామపంచాయతీలలో నిధులను తమ అనుచరుల ఖాతాలకు మళ్లించుకున్నట్లు ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేటాయించిన నిధులు లక్ష్యానికి విరుద్ధంగా వినియోగించబడుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

గ్రామాల్లో ఉన్న నిధులతో వీధిలైట్ల మరమ్మతులు చేయడంతో పాటు, అవసరమైన చోట కొత్త విద్యుత్ బల్బులు అమర్చాలని ఆయన సూచించారు. అలాగే, గ్రామాల్లో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంకులను శుభ్రపరచి, ఆ ట్యాంకుల ద్వారా నీటి సరఫరా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.

చిన్నపాటి వర్షం పడినా అనేక గ్రామాల్లో వీధులు జలమయమవుతున్నాయని, ఇలా కాకుండా పక్కనే ఉన్న డ్రైనేజీలను శుభ్రపరచి వర్షపు నీరు సాఫీగా పారేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. నేటికీ చాలా గ్రామాల్లో త్రాగునీటి పైపులైన్ ఏర్పాటు చేయకపోవడంతో ఇంటింటికి నీటి సరఫరా జరగడం లేదని ఆయన విమర్శించారు.

గ్రామాల్లో పారిశుద్ధ్య పనులను వేగవంతం చేయాలని, కొన్ని గ్రామపంచాయతీలలో దుర్వినియోగమైన నిధులను రికవరీ చేయాలని పెద్దిరెడ్డి చంద్ర ఓబుల్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కటారు వెంకటరమణ పాల్గొన్నారు.