రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో కొందరు ఉద్యోగుల పనితీరు, విధుల పట్ల నిర్లక్ష్యం, ప్రజాధన వినియోగంపై పట్టణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజల పన్నుల రూపంలో వచ్చే నిధులతో నెలకు లక్షల్లో జీతాలు తీసుకుంటున్న కొందరు ఉద్యోగులు విధులను గాలికొదిలేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మున్సిపాలిటీలో అవినీతి, పనితీరులో అలసత్వం రోజురోజుకూ పెరుగుతోందని స్థానికులు విమర్శిస్తున్నారు.
ఆఫీసుకు వచ్చి ఫ్యాన్ కింద కూర్చుని, రోజంతా సెల్‌ఫోన్‌లో రీల్స్, సోషల్ మీడియా చూస్తూ కాలక్షేపం చేసే సంస్కృతి పెరిగిపోతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆరోగ్య విభాగంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి తీరు ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిరోజూ ఆఫీసుకు చక్కగా సిద్ధమై వచ్చి, ఆండ్రాయిడ్ మొబైల్‌లో డేటా ఆన్ చేసి రీల్స్ చూస్తూ సమయాన్ని వృథా చేయడం ఈయనకు నిత్యకృత్యంగా మారిందని మున్సిపల్ వర్గాలు చెబుతున్నాయి.
ఉన్నతాధికారులు ఆఫీసు వైపు వచ్చినప్పుడు లేదా కంటపడినప్పుడు సదరు ఉద్యోగి ఆకస్మికంగా తనకు కళ్లు కనబడటం లేదని, చెవి వినికిడి తగ్గిందని వంకలు చెప్పి, కంటి రెప్పలు వాలుస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు నటిస్తాడని సహోద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. అధికారులు వెళ్లగానే మళ్లీ సెల్‌ఫోన్ మోజులో మునిగిపోతాడని ఆరోపణలు ఉన్నాయి.
ప్రజల ఫైళ్లను పరిశీలించమంటే సాకులు చెప్పే ఈ ఉద్యోగి, రీల్స్ మరియు సోషల్ మీడియాను గంటల తరబడి చూస్తూ గడిపేస్తున్నాడని పౌరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య విభాగంలో పారిశుద్ధ్య పర్యవేక్షణ, జనన–మరణ ధ్రువీకరణ పత్రాల పరిశీలన, జారీ వంటి కీలక బాధ్యతలు ఉన్నప్పటికీ, వాటిలో ఏ ఒక్క పనినీ సక్రమంగా నిర్వహించకుండా కేవలం ఆఫీసులో కూర్చుని కాలక్షేపం చేస్తున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే విలేకరులు మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలు, విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని గమనించి ఫోటోలు, వీడియోలు తీసి ప్రశ్నిస్తే, “మమ్మల్ని బ్లాక్‌మెయిల్ చేయడానికి వచ్చారు” అంటూ నానా వాదనలు చేసి, నలుగురిలో అవమానించేలా ప్రవర్తిస్తున్నారని మీడియా వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. సొంత విధుల్లో తీవ్ర అలసత్వం వహిస్తూ, ప్రజల ఆవేదనను వెలికితీసే విలేకరులపైనే నిందలు మోపడం ఈ ఉద్యోగుల దౌర్భాగ్యపు తీరుకు అద్దం పడుతోందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
సదరు ఉద్యోగికి నెలకు రూ.1,20,000 నుండి రూ.1,40,000 వరకు, రోజుకు దాదాపు రూ.4,000 పైగా ప్రజల సొమ్ము నుండి జీతంగా చెల్లిస్తున్నట్లు మున్సిపల్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు ఉదయం నుంచి సాయంత్రం వరకు 30 కేజీల ఇసుక గంపలను నెత్తిన పెట్టుకుని మూడంతస్తులపైకి వందలసార్లు మోసే మేస్త్రీలు, బేల్దారి కూలీలకు రోజుకు రూ.600–700 కూలీ ఇవ్వడానికి యాజమాన్యాలు పదిసార్లు ఆలోచిస్తుంటే, ఎలాంటి కష్టమూ లేకుండా ఉన్నతాధికారుల కళ్లుగప్పి నాటకాలాడుతున్న ఈ ఉద్యోగికి రోజుకు రూ.4,000 చొప్పున ప్రజల పన్నుల సొమ్మును కట్టబెట్టడం ఎంతవరకు సమంజసం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ప్రస్తుతం దాదాపు 60–70 పోస్టులు ఖాళీగా ఉన్నాయని, నోటిఫికేషన్లు రాక, సరైన ఉపాధి లేక ఉన్నత చదువులు చదివిన ఎంతోమంది నిరుద్యోగ యువకులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, ఉన్న ఉద్యోగాన్ని సక్రమంగా చేయకుండా ప్రజాధనాన్ని దండుకుంటున్న ఇలాంటి ఉద్యోగుల తీరుపై మున్సిపల్ సిబ్బందిలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై ఉన్నతాధికారులు తక్షణమే సమగ్ర విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రొద్దుటూరు పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికార వ్యవస్థ ఇలాంటి ఘటనలపై మౌనం పాటించడం విచారకరమని స్థానిక మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.













