రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: రాయలసీమ ప్రాంతంలో గ్రామీణ, అటవీ, జలవనరులు, రోడ్లు, వ్యవసాయం, తాగునీరు, పశుసంవర్ధక రంగాల్లో విస్తృత అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రత్యేక దృష్టితో ఈ పనులు చేపట్టినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. మొత్తం రూ.8,022 కోట్లకు పైగా వ్యయంతో వివిధ రంగాల్లో అభివృద్ధి పనులు అమలు చేస్తున్నట్లు వివరించారు.
రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తూ రూ.4,523 కోట్లతో 23,000కు పైగా రోడ్డు పనులు చేపట్టినట్లు సమాచారం. వేల కిలోమీటర్ల మేర బీటీ, సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్నట్లు పేర్కొన్నారు. దీంతో రాయలసీమలో గ్రామీణ రవాణా సౌకర్యాలు గణనీయంగా మెరుగుపడనున్నాయని అధికారులు భావిస్తున్నారు.

వ్యవసాయ రంగంలో నీటి వనరుల విస్తరణకు చర్యలు తీసుకున్నారు. మొత్తం 41,614 ఫారం పాండ్లు నిర్మించి, 50,000 ఎకరాలకు పైగా అదనంగా సాగులోకి తీసుకువచ్చినట్లు వివరించారు. ఉపాధి హామీ పథకం ద్వారా 62,000 ఎకరాల్లో ఉద్యాన సాగు విస్తరించి, 28,000 మందికి పైగా రైతులకు ప్రయోజనం కలిగినట్లు తెలిపారు. జల సంరక్షణలో భాగంగా ఇంకుడు గుంతలు, నీటి కుంటల నిర్మాణం ద్వారా భూగర్భ జలాల నిల్వలు పెరిగేలా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
పశుసంవర్ధక రంగంలో భాగంగా 15,000 మినీ గోకులాలు నిర్మించి పాడి రైతులకు అండగా నిలిచినట్లు అధికార వర్గాలు తెలియజేశాయి. గ్రామీణ పారిశుధ్యాన్ని మెరుగుపరచేందుకు 50,000కు పైగా కంపోస్ట్ గుంతలు, 28,000కు పైగా ఇంకుడు గుంతలు నిర్మించినట్లు వివరించారు.

తాగునీటి రంగంలో జల జీవన్ మిషన్–అమరజీవి జలధార పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ పథకాల కోసం రూ.2,782 కోట్ల వ్యయంతో పనులు పురోగతిలో ఉన్నాయని, పులివెందుల, డోన్, చిత్తూరు మెగా వాటర్ గ్రిడ్ వంటి పథకాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చినట్లు పేర్కొన్నారు.

అటవీ, పర్యావరణ పరిరక్షణ దిశగా కూడా చర్యలు తీసుకున్నట్లు సమాచారం. కుంకీ ఏనుగుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు ద్వారా మానవ–ఏనుగు ఘర్షణలు 75 శాతం వరకు తగ్గినట్లు అధికారులు పేర్కొన్నారు. పట్టణాల్లో పచ్చదనాన్ని పెంచేందుకు 13 నగర వనాలు అభివృద్ధి చేసినట్లు తెలిపారు.













