రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: మైదుకూరు: వైఎస్సార్ కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రం సమీపంలో ఆర్టీసీ బస్సుకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోడ్డుపై వివాహ వేడుకల సందర్భంగా కాల్చిన బాణాసంచా పేలుళ్లతో ఏర్పడిన గందరగోళంలో ఈ ఘటన చోటుచేసుకుంది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులో ప్రయాణిస్తున్న వారంతా సురక్షితంగా బయటపడినట్లు సమాచారం.
పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం మైదుకూరు నుంచి ఆళ్లగడ్డ వెళ్తున్న ఆర్టీసీ బస్సు, దువ్వూరు మండల కేంద్రంలో ప్రయాణికులను ఎక్కించుకుని చాగలమర్రి వైపు బయలుదేరింది. దువ్వూరు సమీపంలోని దేవాన్సీ, సివివి కల్యాణ మండపాల వద్దకు బస్సు చేరుకునే సమయానికి, అక్కడ జరుగుతున్న వివాహ వేడుకల్లో భాగంగా కొందరు రోడ్డుపైనే ఒక్కసారిగా టపాసులు కాల్చారు.
ఆ భారీ శబ్దాలతో బైపాస్ రోడ్డు నుంచి వస్తున్న ఓ ద్విచక్ర వాహనదారుడు భయాందోళనకు గురై, ఒక్కసారిగా తన వాహనాన్ని కుడివైపునకు మళ్లించాడు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్, ఆ బైక్‌ను ఢీకొట్టకుండా ఉండేందుకు సమయస్ఫూర్తితో బస్సును ఎడమవైపునకు తిప్పాడు.
ఈ క్రమంలో రోడ్డు పక్కనే తవ్వి ఉంచిన డ్రైనేజీ కాలువలోకి బస్సు దిగి ఒకవైపునకు ఒరిగిపోయింది. అయితే బస్సు పూర్తిగా ఒరిగిపోకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. బస్సులో ఉన్న ప్రయాణికులెవరికి గాయాలు కాకపోవడం స్థానికులకు, ప్రయాణికులకు ఊరట కలిగించింది.
ద్విచక్ర వాహనదారుడు మాత్రం బైక్‌తో పాటు కిందపడిపోవడంతో స్వల్ప గాయాలు అయ్యాయి. అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. బస్సులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడినట్లు ఆర్టీసీ సిబ్బంది తెలిపారు.
ఈ ఘటనపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణ మండపాల వద్ద సరైన పార్కింగ్ సదుపాయాలు లేకపోవడం, రోడ్లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల తరచూ ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని వారు ఆరోపించారు. రోడ్లపై బాణాసంచా కాల్చే వారిపై, అక్రమ ఆక్రమణలపై అధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
దువ్వూరు ప్రాంతంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ సదుపాయాల మెరుగుదల, వివాహ మండపాల వద్ద భద్రతా చర్యలపై సంబంధిత శాఖలు దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.













