రాయలసీమ న్యూస్, వై.యస్.ఆర్: ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలుగు దేశం పార్టీ మాజీ ఇంచార్జ్ ఉక్కు ప్రవీణ్ తీవ్రంగా స్పందించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలహీనంగా ఉందన్న భావనతో రాచమల్లు మాట్లాడుతున్నారని, అక్కడ పార్టీకి తాను అండగా ఉన్నానని ప్రవీణ్ స్పష్టం చేశారు.
ప్రొద్దుటూరులో తెలుగుదేశం పార్టీకి నాయకులు, కార్యకర్తలు లేరనుకునే పరిస్థితి లేదని, పార్టీ కోసం, పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం తాను ముందుండి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన పేర్కొన్నారు. తాను ఉన్నప్పుడు టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తే సహించబోమని హెచ్చరించారు.
టీడీపీ నాయకులు నిజాలు చెబితే వాటిని జీర్ణించుకోలేని స్థితిలో రాచమల్లు ఉన్నారని ఉక్కు ప్రవీణ్ విమర్శించారు. దమ్ము, ధైర్యం ఉంటే టీడీపీ నాయకులు, కార్యకర్తల జోలికి రావాలని ఆయన సవాల్ విసిరారు. చల్లా రాజగోపాల్‌పై రాచమల్లు చేసిన అనుచిత వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
ప్రొద్దుటూరులో బీసీ నాయకులంటే రాచమల్లుకు ఇష్టం ఉండదని, బీసీ వర్గానికి చెందిన నాయకులను లక్ష్యంగా చేసుకుని ఆయన వ్యవహరిస్తున్నారని ఉక్కు ప్రవీణ్ ఆరోపించారు. రమేష్ యాదవ్‌ను ఎంత ఇబ్బంది పెట్టారో ప్రజలకు బాగా తెలుసునని మండిపడ్డారు.
రాచమల్లు వద్ద ఉన్న కొందరిని లోపాయికారీ ఒప్పందాల ద్వారా టీడీపీలోకి పంపించిన విషయాన్ని కూడా ఉక్కు ప్రవీణ్ ప్రస్తావించారు. వ్యక్తిగత దూషణలు మానుకుని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని రాచమల్లుకు హితవు పలికారు.
వైకాపా హయాంలో ప్రొద్దుటూరు వ్యాపారవేత్తలు, వర్తకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, స్థానికంగా వ్యాపార వాతావరణం దెబ్బతిన్నదని ఉక్కు ప్రవీణ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో రాజకీయ నాయకులు పరస్పరం వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం కంటే ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
సమయం చెప్పు.. రాజగోపాల్‌తో కలిసి నీ ఇంటికే వస్తా.. నాలుక కోస్తావో లేదో చూస్తాం













