భారత్‌లో టెలిగ్రామ్ తాత్కాలిక నిషేధం: నీట్ పేపర్ లీక్ వివాదంతో లింక్ ఏమిటి?

దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న NEET UG 2026 పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్‌పై కఠిన చర్యలు ప్రారంభించింది. జూన్ 21న జరగనున్న నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్‌కు ముందు జూన్ 22 వరకు భారత్‌లో టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని నిర్ణయించింది. పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతున్న ముఠాలు, సైబర్ ఫ్రాడ్ గ్యాంగులు ఈ యాప్‌ను విస్తృతంగా వినియోగిస్తున్నాయనే ఆరోపణలపై ఈ చర్యలు తీసుకున్నారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం కొందరు కేటుగాళ్లు టెలిగ్రామ్‌లో నకిలీ ప్రశ్నాపత్రాలు అమ్ముతూ, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్టు గుర్తించారు. అంతేకాకుండా, టెలిగ్రామ్‌లో ఉన్న ఒక ప్రత్యేక ఫీచర్‌ను ఉపయోగించి పరీక్ష ముగిసిన తర్వాత ప్రశ్నాపత్రం ముందే లీక్ అయినట్టు కనిపించేలా నకిలీ ఆధారాలు సృష్టిస్తున్నారని ఎన్‌టీఏ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఐటి మంత్రిత్వ శాఖ జూన్ 22 వరకు టెలిగ్రామ్‌ను బ్యాన్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ వ్యవహారంలో రెండు విడి ఆదేశాలను ఇచ్చింది. మొదటి ఆదేశం ప్రకారం జూన్ 22 వరకు టెలిగ్రామ్ యాప్ యాక్సెస్‌ను దేశంలో నిలిపివేస్తారు. రెండో ఆదేశం ప్రకారం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లోని సెక్షన్ 69A కింద జూన్ 30 వరకు టెలిగ్రామ్‌లో ఇప్పటికే పోస్ట్ చేసిన మెసేజ్‌లను ఎడిట్ చేసే ఫీచర్‌ను భారత్‌లో డిసేబుల్ చేయాలని నిర్ణయించారు. టెలిగ్రామ్ గ్రూపులు, ఛానెళ్లను పెద్ద ఎత్తున డిలీట్ చేసినా ప్రయోజనం లేకపోవడంతో ఈసారి సమయపరిమితి ఉన్న కఠిన చర్యలు తీసుకున్నట్టు ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

గత కొన్ని నెలలుగా టెలిగ్రామ్‌లో జరుగుతున్న మోసాలపై ఎన్‌టీఏ నిఘా పెట్టింది. పరీక్షలను లక్ష్యంగా చేసుకుని కొన్ని ఆర్గనైజ్డ్ చీటింగ్ ముఠాలు, సైబర్ క్రైమ్ నెట్‌వర్క్‌లు యాక్టివ్‌గా ఉన్నట్టు గుర్తించారు. టెలిగ్రామ్‌లో PAPER LEAKED NEET, Re-NEET 2026, Private Mafia, REE NEET MAFIAA వంటి పేర్లతో బహిరంగంగా ఛానెళ్లు నడుస్తున్నాయని ఎన్‌టీఏ తెలిపింది. ఈ ఛానెళ్ల నిర్వాహకులు తమ వద్ద నీట్ ఒరిజినల్ ప్రశ్నాపత్రం ఉందని విద్యార్థులు, వారి తల్లిదండ్రులను నమ్మించి కొన్ని వేల నుంచి లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నట్టు తేలింది. సెక్యూర్డ్ ఎగ్జామ్ ప్రాసెస్ వెలుపల ఎలాంటి ప్రశ్నాపత్రం ఉండదని, ఇలాంటి ఆఫర్లు పూర్తిగా మోసపూరితమని ఎన్‌టీఏ హెచ్చరించింది.

టెలిగ్రామ్‌ను ప్రత్యేకంగా టార్గెట్ చేయడానికి కారణంగా ఎన్‌టీఏ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్‌ను చూపించింది. సాధారణంగా టెలిగ్రామ్‌లో పాత మెసేజ్‌లను ఎడిట్ చేసినా, మొదట పోస్ట్ చేసిన సమయమే కనిపిస్తుంది. పీడీఎఫ్ ఫైళ్లను కూడా మార్చే అవకాశం ఉంది. ఈ లోపాన్ని కేటుగాళ్లు వినియోగిస్తున్నారని అధికారులు గుర్తించారు. పరీక్షకు ముందు సాధారణ మెసేజ్ పెట్టి, పరీక్ష ముగిసిన తర్వాత ఆ మెసేజ్‌ను ఎడిట్ చేసి ఒరిజినల్ ప్రశ్నాపత్రాన్ని జతచేస్తున్నారు. ఆ తర్వాత స్క్రీన్‌షాట్లు తీసి పరీక్షకు ముందే పేపర్ తమ ఛానెల్‌లో పెట్టినట్టు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి నకిలీ లీక్ ఆధారాలను అడ్డుకోవడానికే జూన్ 30 వరకు ఎడిట్ ఫీచర్‌ను నిలిపివేయాలని నిర్ణయించారు.

ఈ మోసగాళ్లను పట్టుకునేందుకు ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ గత కొన్ని వారాలుగా ఆపరేషన్ నిర్వహిస్తోంది. ఎన్‌టీఏ, రాష్ట్ర పోలీసుల ఇన్‌పుట్‌ల ఆధారంగా అనేక నకిలీ ఛానెళ్లు, గ్రూపులు, బాట్లను డిలీట్ చేయించారు. బీహార్ పోలీస్ ఎకనామిక్ ఆఫెన్సెస్ వింగ్ జూన్ 9న విద్యార్థులకు ఈ ఫేక్ లీకులపై అలర్ట్ జారీ చేసింది. అహ్మదాబాద్ సిటీ సైబర్ క్రైమ్ బ్రాంచ్ అంతర్రాష్ట్ర సైబర్ ఫ్రాడ్ గ్యాంగ్‌ను అరెస్ట్ చేసింది. ఈ గ్యాంగ్ ఎనిమిది టెలిగ్రామ్ ఛానెళ్లు నడుపుతూ దాదాపు 1.5 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపినట్టు, ఒకే నెలలో వెయ్యి మొబైల్ నంబర్లను సంప్రదించినట్టు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఎన్‌టీఏ ఎక్స్‌లో ముందుగానే ప్రశ్నాపత్రం ఎవరికీ దొరకదని, ఇలాంటి వదంతులను నమ్మవద్దని హెచ్చరిక జారీ చేసింది.

కేంద్ర నిర్ణయంపై టెలిగ్రామ్ ఫౌండర్, సీఈఓ పావెల్ దూరావ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పేపర్ లీక్‌లను అడ్డుకోవడంలో ఈ బ్యాన్ విఫలమైందని, దీని వల్ల ప్రయోజనం లేకపోయిందని ఆయన విమర్శించారు. భారత్‌లో ఉన్న సుమారు 15 కోట్ల సాధారణ టెలిగ్రామ్ వినియోగదారులను శిక్షించినట్టైందని ఆయన ఎక్స్‌లో వ్యాఖ్యానించారు.

అలాగే ఈ బ్యాన్ వల్ల అక్రమాలు ఆగలేదని, లీకులు కేవలం టెలిగ్రామ్ నుంచి ఇతర యాప్‌లకు మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. కోట్లాది మంది వ్యాపార, వ్యక్తిగత కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే యాప్‌ను పూర్తిగా ఆపడం సరైన నిర్ణయం కాదని దురోవ్ అభిప్రాయపడ్డారు.