రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్:
నీకెందుకు?.. ప్రతి దాంట్లో వేలెందుకు పెడతావు?
ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై బండ్ల గణేశ్ కౌంటర్
నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా చేసిన వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేశ్ తీవ్రంగా స్పందించారు. ఇటీవల తెలంగాణలోనూ జనసేన విస్తరణపై, రానున్న ఎన్నికల్లో అక్కడ కూడా పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ చేసిన పోస్ట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ రాజకీయాల్లో జనసేన ప్రవేశంపై పరోక్షంగా స్పందించిన ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను లక్ష్యంగా చేసుకుని ఆయన పెట్టిన పోస్ట్ పట్ల జనసేన అనుచరులు, అభిమానులు విభిన్నంగా స్పందిస్తున్నారు.
మీరొస్తానంటె మేమొద్దంటామా?
రండి దొర.. కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా?, పొత్తుతో వస్తున్నారా? లేదా సింగల్ గా వస్తున్నారా? అది చెప్పి రండి
ప్రకాశ్ రాజ్ ఈ వ్యాఖ్యలపై నిర్మాత బండ్ల గణేశ్ కౌంటర్ ఇస్తూ, ఆయనను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. ప్రతి విషయంలో జోక్యం చేసుకోవడానికి ప్రకాశ్ రాజ్ ఎవరు అనే ప్రశ్నను బండ్ల గణేశ్ లేవనెత్తారు. ప్రతి ఊర్లో, ప్రతి అంశంలో జోక్యం చేసుకుని తీర్పులు చెప్పే హక్కు ఆయనకు ఎవరు ఇచ్చారని ప్రశ్నిస్తూ మండిపడ్డారు.
ప్రకాశ్ రాజ్ తరచూ వివిధ రాజకీయ, సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉండటంపై బండ్ల గణేశ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి ఇష్యూలో జోక్యం చేసుకుని జడ్జిమెంట్‌లు ఇవ్వడానికి ఆయన ఏమన్నా కలెక్టరా, లేక దేశ ప్రధానా అన్నట్టు ప్రశ్నిస్తూ విమర్శలు చేశారు.
ముందుగా తన విషయాలు చూసుకుని, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయాలని సూచిస్తూ బండ్ల గణేశ్ వరుసగా పోస్ట్‌లు పెట్టారు. ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలపై ఆయన చేసిన ఈ కౌంటర్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా చర్చకు దారితీసింది. జనసేన విస్తరణ, తెలంగాణ రాజకీయ సమీకరణల నేపథ్యంలో ఈ వాగ్యుద్ధం మరింత వేడెక్కినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







