తమిళ సినీ పరిశ్రమలో విషాదం..

నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్ కన్నుమూత

తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, దర్శకుడు కె. భాగ్యరాజ్(73) శనివారం ఉదయం కన్నుమూశారు. గుండెపోటుతో అస్వస్థతకు గురైన ఆయనను వెంటనే చెన్నైలోని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

నటుడు, దర్శకుడు, కథా రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలిగా భాగ్యరాజ్ తమిళ సినీ రంగంలో ప్రత్యేక గుర్తింపు పొందారు. తనదైన శైలిలో కుటుంబ కథా చిత్రాలను తెరకెక్కిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించారు. నటుడిగా సుమారు 75కు పైగా చిత్రాల్లో నటించారు. 25కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించారు. తమిళ చిత్ర పరిశ్రమలో ఆయనను ‘వన్ మ్యాన్ స్టూడియో’గా అభివర్ణించేవారు. దర్శకుడు, రచయిత, నటుడు, సంగీత దర్శకుడు, నవలా రచయితగా అనేక రంగాల్లో ఆయన తన ముద్ర వేశారు. భాగ్యరాజ్ మరణంతో తమిళ సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతిపట్ల సినీ ప్రముఖులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పిస్తున్నారు. ఆయన సేవలను స్మరించుకుంటూ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటిస్తున్నారు.