ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా తీసుకునే ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. సాధారణంగా బీట్రూట్ ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయగా, రక్తాన్ని పెంచే ఆహారంగా వైద్యులు, పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తుంటారు. అయితే మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్న రోగుల విషయంలో మాత్రం ఆహార నియమాలు పూర్తిగా భిన్నంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

కిడ్నీ సమస్యలు ఉన్నవారు బీట్రూట్ తినవచ్చా లేదా అనే అంశంపై వైద్య నిపుణులు ఇటీవల పలు ముఖ్యమైన విషయాలను వెల్లడించారు. బీట్రూట్‌లో విటమిన్లు, ఖనిజ లవణాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నప్పటికీ, ఇందులో ఆక్సలేట్లు మరియు పొటాషియం అధిక మోతాదులో ఉంటాయి. సాధారణ ఆరోగ్యవంతుల శరీరంలో ఈ లవణాలు సులభంగా విసర్జించబడతాయి.

కానీ కిడ్నీల పనితీరు మందగించిన రోగులలో ఈ లవణాలను వడపోసే సామర్థ్యం తగ్గిపోతుంది. దాంతో రక్తంలో పొటాషియం స్థాయిలు ప్రమాదకరంగా పెరిగే అవకాశం ఉంది. అలాగే కిడ్నీలలో ఆక్సలేట్ రాళ్లు ఏర్పడే ముప్పు కూడా గణనీయంగా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి అయిన క్రానిక్ కిడ్నీ డిసీస్ మూడవ, నాల్గవ దశల్లో ఉన్న రోగులు, అలాగే డయాలసిస్ చేయించుకుంటున్న వారు బీట్రూట్‌ను వీలైనంతవరకు పూర్తిగా నివారించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రక్తంలో పొటాషియం పరిమాణం అధికమైతే దానిని హైపెర్కలేమియా అంటారు. ఈ పరిస్థితి ఏర్పడితే గుండె కొట్టుకునే వేగంలో మార్పులు రావడం, తీవ్రమైన స్థాయిలో గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

కాబట్టి కిడ్నీ వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారు తమ దైనందిన ఆహారంలో బీట్రూట్‌ను పక్కన పెట్టడం ఉత్తమమని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. అయితే కిడ్నీ సమస్యలు ప్రారంభ దశలో ఉన్నవారు లేదా కేవలం కిడ్నీ స్టోన్స్ సమస్యతో బాధపడి కోలుకున్న వారు, వైద్యుల ముందస్తు సలహాతో చాలా పరిమిత పరిమాణంలో బీట్రూట్‌ను తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

బీట్రూట్‌ను నేరుగా పచ్చిగా లేదా జ్యూస్ రూపంలో తీసుకోవడం కంటే, ముక్కలుగా కోసి నీటిలో బాగా ఉడికించి, ఆ నీటిని పారబోసి కూరగా వండుకుని తినడం వల్ల అందులోని ఆక్సలేట్ల శాతం కొంతవరకు తగ్గుతుందని వైద్య నిపుణులు వివరిస్తున్నారు. ఈ విధానం ద్వారా లవణాల తీవ్రత తగ్గి కిడ్నీలపై అదనపు భారం పడకుండా ఉండే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.

ప్రతి కిడ్నీ రోగి శరీర తత్వం, వ్యాధి తీవ్రత వేర్వేరుగా ఉండటంతో, ఒకరి ఆహార నియమాలను మరొకరు అనుకరించడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్‌లో లభించే సాధారణ సమాచారాన్ని ఆధారంగా చేసుకుని స్వయంగా నిర్ణయాలు తీసుకోవద్దని వారు సూచిస్తున్నారు.

కిడ్నీ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో బీట్రూట్ లేదా ఇతర పొటాషియం అధికంగా ఉండే కూరగాయలను చేర్చుకునే ముందు తప్పనిసరిగా తమ నెఫ్రోలోజిస్ట్ లేదా క్లినికల్ Dietitian‌ ను సంప్రదించాలని వైద్యులు సూచిస్తున్నారు. రోగుల రక్త పరీక్షల నివేదికలు, కిడ్నీ పనితీరు స్థితిని పరిశీలించిన తర్వాతే సరైన డైట్ ప్లాన్ రూపొందించుకోవాలని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.