రాయలసీమ న్యూస్, హెల్త్ డెస్క్:
భారతంలో కిడ్నీ వ్యాధుల ఆందోళనకర విస్తరణ
భారతదేశంలో మూత్రపిండాల వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. సాధారణంగా ఇది చివరి దశలోనే బయటపడుతోంది. క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకుంటే ముందుగానే నిర్ధారణ సాధ్యమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, ఈ విషయంపై అవగాహన లేక ఎందరో ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఈ వ్యాధికి సంబంధించిన కేసులు, మరణాలు అధికంగా ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
శరీరంలోని విషతుల్య వ్యర్థాలను తొలగించి, రక్తాన్ని శుభ్రపరిచే ముఖ్య అవయవాలు మూత్రపిండాలు. మారుతున్న ఆహార అలవాట్లు, జీవనశైలి కారణంగా వీటి పనితీరు దెబ్బతింటోంది. కొన్ని అధ్యయనాల ప్రకారం ప్రపంచంలోని కిడ్నీ బాధితుల సంఖ్యలో భారత్ రెండో స్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 85 కోట్ల మంది కిడ్నీ వ్యాధులతో బాధపడుతుండగా, భారత్‌లో దాదాపు 13.8 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరిలో చాలామందికి సమస్య ముదిరే వరకు తమకు కిడ్నీ వ్యాధి ఉందనే విషయం తెలియదు.
ప్రతి సంవత్సరం దేశంలో రెండు లక్షల కంటే ఎక్కువ మందికి కొత్తగా కిడ్నీ అవసరం వస్తోంది. అయితే ఆ డిమాండ్‌లో మూడు శాతం మాత్రమే తీరుతోంది. గతంలో ప్రధానంగా వృద్ధుల్లో కనిపించిన ఈ సమస్య ఇప్పుడు 30 ఏళ్లలోపు యువతలో కూడా సాధారణంగా మారుతోంది. భారత వైద్య పరిశోధన మండలి నివేదిక ప్రకారం దేశంలో సగటున 3.2 శాతం మంది మూత్రపిండాల వ్యాధి బారిన పడుతుంటే, తెలంగాణలో ఈ సగటు 7.4 శాతంగా ఉంది. అక్కడ ప్రతి 14 మందిలో ఒక్కరు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు.
దిల్లీలోని Institute of Liver and Biliary Sciences నిర్వహించిన అధ్యయనం ప్రకారం 2023లో తెలంగాణలో ప్రతి లక్ష మందికి 242 కేసులు నమోదయ్యాయి. వీరిలో దాదాపు 20 మంది మరణించారు. కిడ్నీ వ్యాధుల వల్ల నమోదైన ఈ మరణాలు దేశంలోనే అత్యధికం. కొన్ని ఇతర రాష్ట్రాల్లో కేసులు ఎక్కువగా ఉన్నప్పటికీ, మరణాల రేటు మాత్రం తక్కువగా ఉంది.
నిశ్శబ్దంగా మృత్యుఘంటికలు
కిడ్నీ వ్యాధి నిశ్శబ్ద హంతకుడిలా వ్యవహరిస్తోంది. మూత్రపిండాలు 70–80 శాతం దెబ్బతినే వరకు స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవడం వల్ల ముందస్తు గుర్తింపు కష్టమవుతోంది. నొప్పి నివారణ మందులు అధికంగా వాడటం, కలుషిత నీరు సేవించడం, ఫిట్‌నెస్ కోసం క్రియేటిన్, ప్రొటీన్ సప్లిమెంట్‌లను నియంత్రణ లేకుండా తీసుకోవడం వంటి కారణాలు కిడ్నీ పనితీరును దెబ్బతీస్తున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా కిడ్నీ నష్టాన్ని వేగవంతం చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో వ్యాధి ప్రబలడానికి గల కారణాలపై ముమ్మర పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. తదనుగుణంగా నివారణ చర్యలు చేపట్టాలని, ప్రజలు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. పొగ తాగడం కిడ్నీ జబ్బుకు కారణమే కాకుండా, ఇప్పటికే ఉన్న వ్యాధి త్వరగా ముదిరేలా చేస్తోంది. పొగాకు ఉత్పత్తులు, మాదక ద్రవ్యాలు కూడా మూత్రపిండాలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి.
ఉద్దానం ప్రాంతంలో తీవ్ర పరిస్థితి
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం నికరాగువా, కోస్టారిక, శ్రీలంక తర్వాతి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులు అధికంగా ఉన్నారు. అక్కడి ఆరు మండలాల్లో వేలాది మంది మూత్రపిండాల వ్యాధులతో బాధపడుతున్నారు. అధికారుల లెక్కల ప్రకారం అక్కడ దాదాపు 35 వేల మంది కిడ్నీ రోగులు ఉన్నారు. ఇదే జిల్లాలోని ఇతర ప్రాంతాలకు కూడా ఈ వ్యాధి విస్తరిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి రోగిపై ఏడాదికి సుమారు రూ.86 వేల వరకు ఖర్చు చేస్తోంది. ఏపీలో దాదాపు 21,504 మంది, తెలంగాణలో 15 వేల మందికి పైగా కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉచిత డయాలసిస్ సేవలు పొందుతున్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధుల మూలాలపై పరిశోధన చేయడానికి Indian Council of Medical Research ఇటీవల ఆమోదం తెలిపింది. మూడేళ్ల కాలవ్యవధిలో ఈ పరిశోధన పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అవయవ మార్పిడి కార్యక్రమం ద్వారా కిడ్నీ దానం, మార్పిడిని ప్రోత్సహిస్తున్నారు.
చికిత్స, నియంత్రణలో సవాళ్లు
డయాలసిస్, కిడ్నీ మార్పిడి వంటి చికిత్సలు ఖరీదైనవి కావడంతో కొంతమంది రోగులు వైద్యానికి ముందుకు రావడం లేదు. సామాన్యులకు ఇవి ఆర్థిక భారంతో పాటు దూరాభారంగా మారుతున్నాయి. కుటుంబంలో ఎవరికైనా మూత్రపిండాల వ్యాధి ఉంటే ఆ కుటుంబ సభ్యులందరికీ, అలాగే మధుమేహం, రక్తపోటు ఉన్నవారికి క్రమం తప్పకుండా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వ్యాధి నిర్ధారణ అయితే సమయానికి డయాలసిస్ ప్రారంభించాల్సిన అవసరం ఉంది.
సమీప ప్రాంతాల్లోనే రక్తశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేయడం, రోగుల్లో ధైర్యం నింపడం కీలకం. కొంతమంది పేదల అసహాయతను దుర్వినియోగం చేసుకుని కిడ్నీ దానాల పేరిట అక్రమ రవాణా, మోసాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు, పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో మూత్రపిండాల వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు, బాధితులకు సహాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.







