వెనెజువెలా భూకంపాలకు క్షణాల ముందే గూగుల్‌ అలర్ట్‌లు

దక్షిణ అమెరికా దేశం వెనెజువెలాను వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్రంగా వణికిస్తున్నాయి. వందేళ్లలో చూడని స్థాయిలో సంభవించిన ఈ ప్రకృతి విపత్తుతో అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. లక్షలాది మంది ప్రజలు ఇళ్లను కోల్పోయి వీధులపైకి రావాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో భూకంపాలు సంభవించడానికి కొన్ని క్షణాల ముందే గూగుల్‌ పలు స్మార్ట్‌ఫోన్లకు అలర్ట్‌లు పంపినట్లు సమాచారం బయటకు వచ్చింది.

వెనెజువెలా భూకంపాలపై సోషల్‌ మీడియాలో పలు నెటిజన్లు తమ ఫోన్లలోకి వచ్చిన గూగుల్‌ అలర్ట్‌ల స్క్రీన్‌షాట్లను పంచుకుంటున్నారు. బుధవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఈ అలర్ట్‌లు వచ్చాయని, కొద్ది సేపటికే శక్తివంతమైన ప్రకంపనలు నమోదయ్యాయని వారు చెబుతున్నారు. దీంతో గూగుల్‌ ఆండ్రాయిడ్‌ ఎర్త్‌క్వేక్‌ అలర్ట్‌ సిస్టమ్‌ ఎలా పనిచేస్తుందనే ఆసక్తి పెరిగింది.

అధునాతన స్మార్ట్‌ఫోన్లలో యాక్సిలరోమీటర్‌ అనే సెన్సార్‌ ఉంటుంది. సాధారణంగా ఫోన్‌ను తిప్పినప్పుడు స్క్రీన్‌ దిశను ఆటోమేటిక్‌గా మార్చే పనిని ఇది చేస్తుంది. అయితే ఇదే సెన్సార్‌ భూమి నుంచి వచ్చే సూక్ష్మ కంపనాలను కూడా గుర్తించి కొలవగలదు. మనం ఉన్న ప్రాంతంలో భూమిలో ఏర్పడే వైబ్రేషన్లను ఇది సేకరిస్తుంది. అవి భూకంపానికి దారితీసేంత బలంగా ఉన్నాయని గుర్తించిన వెంటనే ఆండ్రాయిడ్‌ ఎర్త్‌క్వేక్‌ అలర్ట్‌ సిస్టమ్‌కు సిగ్నల్‌ పంపిస్తుంది. దాని ఆధారంగా సుమారుగా ఏ ప్రాంతంలో భూకంపం వచ్చే అవకాశం ఉందో గూగుల్‌ అంచనా వేస్తుంది.

ఒక స్మార్ట్‌ఫోన్‌ నుంచి సిగ్నల్‌ అందిన తర్వాత గూగుల్‌ సర్వర్లు ఆ ప్రాంతంలోని ఇతర ఆండ్రాయిడ్‌ ఫోన్లలోని యాక్సిలరోమీటర్ల డేటాను కూడా పరిశీలిస్తాయి. ఎక్కువ ఫోన్లు ఒకే విధమైన ప్రకంపనలను నమోదు చేస్తే, ఆ ప్రాంతంలో భూకంపం సంభవించబోతుందని భావించి వెంటనే అలర్ట్‌లు పంపిస్తాయి. ఈ మొత్తం ప్రక్రియ క్షణాల్లో పూర్తవుతుంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200 కోట్ల ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ ఫీచర్‌ అందుబాటులో ఉందని గూగుల్‌ వెల్లడించింది.

భూకంపం ఒక్కసారిగా జరిగే కుదుపు కాదు. తరంగాల రూపంలో వస్తుంది. ముందుగా ప్రైమరీ వేవ్స్‌ వస్తాయి. ఇవి సెకనుకు సుమారు ఆరు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. తర్వాత సెకండరీ వేవ్స్‌ వస్తాయి. ఇవి సెకనుకు 3–4 కిలోమీటర్ల వేగంతో పయనిస్తాయి. భూకంపం వల్ల జరిగే అత్యధిక నష్టానికి కారణం ఈ సెకండరీ వేవ్స్‌నే. స్మార్ట్‌ఫోన్లు గుర్తించేది ప్రధానంగా ప్రైమరీ వేవ్స్‌. ఇవి రాగానే సర్వర్‌కు సిగ్నల్‌ వెళ్లడం వల్ల, సెకండరీ వేవ్స్‌ చేరుకునేలోపే గూగుల్‌ సర్వర్లు సమాచారాన్ని సేకరించి అలర్ట్‌ పంపించే అవకాశం దొరుకుతుందని టెక్‌ నిపుణులు చెబుతున్నారు.

భూకంప తీవ్రతను బట్టి ఆండ్రాయిడ్‌ ఫోన్లు రెండు రకాల అలర్ట్‌లు ఇస్తాయి. తక్కువ తీవ్రత ప్రకంపనల సమయంలో ‘బి అవేర్‌ అలర్ట్‌’ పంపిస్తాయి. మధ్యస్థ, తీవ్రమైన భూకంపాల సమయంలో ‘టేక్‌ యాక్షన్‌ అలర్ట్‌’ జారీ చేస్తాయి. ఈ అలర్ట్‌ను టచ్‌ చేస్తే భూకంపం వచ్చే అవకాశం ఉన్న పరిధిని మ్యాప్‌పై చూపించడంతో పాటు, విపత్తు సమయంలో ఎలా సురక్షితంగా ఉండాలో కొన్ని సూచనలు కూడా అందిస్తాయి.

భారత్‌లోనూ 2023 నుంచి ఆండ్రాయిడ్‌ ఎర్త్‌క్వేక్‌ అలర్ట్‌ సిస్టమ్‌ యాక్టివ్‌లో ఉంది. ఆండ్రాయిడ్‌ 5 మరియు అంతకంటే ఆధునిక వెర్షన్లలో ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. అయితే అలర్ట్‌లు రావాలంటే ఫోన్‌లో మొబైల్‌ డేటా లేదా వైఫై ఆన్‌లో ఉండాలి. అలర్ట్‌లు రావద్దనుకునే వినియోగదారులు డివైజ్‌ సెట్టింగ్స్‌లో ఎర్త్‌క్వేక్‌ లేదా ఎమర్జెన్సీ అలర్ట్స్‌ ఎంపికలను ఆఫ్‌ చేసుకోవచ్చు.