రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
అఫ్గానిస్థాన్‌పై పాక్ వైమానిక దాడులు నరమేధం
ఐరాసలో భారత్ ధ్వజమెత్తిన
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్ ద్వంద్వ విధానాలను, ఉగ్రవాదానికి ప్రోత్సాహం ఇస్తున్న చర్యలను భారత్ తీవ్రంగా ఎండగట్టింది. అఫ్గానిస్థాన్ భూభాగంపై పాకిస్థాన్ సైన్యం ఇటీవల జరిపిన వైమానిక దాడులను అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనగా భారత ప్రతినిధి మండిపడ్డారు. ఆ దాడులు ముమ్మాటికీ సామాన్య పౌరులపై జరిగిన నరమేధమేనని భారత్ స్పష్టం చేసింది.
ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి హరీష్ పర్వతనేని భద్రతా మండలి సమావేశంలో మాట్లాడుతూ, పవిత్ర రంజాన్ మాసంలో కూడా పాకిస్థాన్ జరిపిన దాడుల్లో మహిళలు, చిన్న పిల్లలు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దారుణమని వ్యాఖ్యానించారు. పౌరులను లక్ష్యంగా చేసుకుని జరిపే దాడులను ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థించలేమని ఆయన తెలిపారు.
అని రాయబారి హరీష్ పర్వతనేని పాకిస్థాన్‌ను ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పౌరులను చంపడం, పిల్లలను అనాథలను చేయడం ఎప్పటికీ ఉగ్రవాద నిర్మూలన కాదని ఆయన స్పష్టం చేశారు.
ఐరాస నివేదికలను ఉటంకిస్తూ హరీష్ పర్వతనేని, 2026 మొదటి మూడు నెలల్లోనే పాకిస్థాన్ దాడుల వల్ల 372 మంది అమాయక పౌరులు మరణించగా, 397 మంది గాయపడ్డారని వివరించారు. ఈ దారుణాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపి, బాధ్యులైన నిందితులను కఠినంగా శిక్షించాలని భారత్ డిమాండ్ చేసింది.
అఫ్గానిస్థాన్ వాణిజ్యాన్ని దెబ్బతీసేలా పాకిస్థాన్ ల్యాండ్ రూట్‌ను నిలిపివేయడాన్ని భారత్ “ట్రేడ్ అండ్ ట్రాన్సిట్ టెర్రరిజం”గా అభివర్ణించింది. దీనికి విరుగుడుగా అఫ్గాన్ వస్తువులకు భారత్ సుంకాలు లేని మార్కెట్ సదుపాయాన్ని కల్పించడంతో పాటు ప్రత్యేక ఎయిర్ కార్గో కారిడార్‌ను అందుబాటులోకి తెచ్చిందని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్ మొత్తం ఎగుమతుల్లో 43 శాతం భారత్‌కే జరుగుతున్నాయని ప్రపంచ బ్యాంక్ నివేదికలను ఆయన ప్రస్తావించారు.
ఒకవైపు పాకిస్థాన్ అరాచకాలు సృష్టిస్తుంటే, మరోవైపు భారత్ మాత్రం అఫ్గానిస్థాన్‌లోని మొత్తం 34 ప్రావిన్సుల్లో 500కు పైగా సంక్షేమ ప్రాజెక్టుల ద్వారా మానవతా దృక్పథంతో అండగా నిలుస్తోందని హరీష్ పర్వతనేని వివరించారు. ఆగస్టు 2021 నుంచి ఇప్పటి వరకు భారత్ 50,000 టన్నుల గోధుమలు, 420 టన్నుల మందులు, వ్యాక్సిన్లను అఫ్గానిస్థాన్‌కు సరఫరా చేసింది.
కాబూల్‌లోని ఇందిరా గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ ఆధునీకరణతో పాటు పలు ప్రాంతాల్లో మాతాశిశు క్లినిక్‌లు, క్యాన్సర్, ట్రామా కేర్ సెంటర్ల నిర్మాణం కొనసాగుతోందని ఆయన తెలిపారు. గుండె జబ్బులతో బాధపడుతున్న అఫ్గాన్ పిల్లలకు భారత్‌లో ఉచిత వైద్యం అందిస్తున్నట్లు, క్రీడా దౌత్యంలో భాగంగా అఫ్గానిస్థాన్ క్రికెట్ జట్టుకు ద్వైపాక్షిక సిరీస్ కోసం భారత్ ఆతిథ్యం ఇస్తోందని వివరించారు.
పాకిస్థాన్ అంతర్గత రాజకీయ, ఆర్థిక వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ‘ఫిత్నా అల్ హిందుస్థాన్’ వంటి తప్పుడు ప్రచారాలతో దేశంలో “ద్వేషపూరిత ఫ్యాక్టరీ”ని నడుపుతోందని భారత్ ఆరోపించింది. పాకిస్థాన్ తెచ్చిన 27వ రాజ్యాంగ సవరణ ఆ దేశంలో పరోక్ష సైనిక పాలనకు నిదర్శనమని భారత్ ఎద్దేవా చేసింది.
అంతర్జాతీయ సమాజం అఫ్గాన్ ప్రజలను ఒంటరి చేయకుండా వారికి అండగా నిలవాలని, వారి భద్రత, అభ్యున్నతికి సహకరించాలని భారత్ భద్రతా మండలి వేదికగా పిలుపునిచ్చింది.







