రాయలసీమ న్యూస్, ఇంటర్నేషనల్ డెస్క్:
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోసారి ప్రపంచ దేశాలను వణికిస్తున్నాయి. ఈ ఘర్షణలు తీవ్రరూపం దాల్చి మళ్లీ పూర్తిస్థాయి యుద్ధం మారుతుందా..? అనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే కొన్నిరోజులుగా అమెరికా-ఇరాన్ పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా రెండు యూఏఈ ట్యాంకర్లపై ఇరాన్ దాడి చేయడంతో భారత సిబ్బంది ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఒమన్ తీరం సమీపంలో జరిగిన ఈ దాడిలో మరో ఆరుగురు భారతీయులు, ఇద్దరు ఉక్రెయిన్ జాతీయులు కూడా గాయపడ్డారు. ఈ మేరకు యూఏఈ రక్షణశాఖ ప్రకటించింది.
ఈ దాడిని యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఇది అంతర్జాతీయ చట్టాల ఉల్లంఘనేనని ఆగ్రహం వ్యక్తంచేసింది. దీనికి ప్రతిస్పందించే హక్కు తమకు ఉందని హెచ్చరించింది. తమ సార్వభౌమత్వం, భద్రతను పరిరక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకొంటామని తేల్చిచెప్పింది. ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోవడానికి, ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసే చర్యలకు తగినవిధంగా ప్రతిస్పందించేందుకు యూఏఈ పూర్తి సంసిద్ధంగా ఉండేదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
హర్మూజ్ లో ప్రయాణిస్తున్న నౌకలపై కొన్నిరోజుల క్రితం ఇరాన్ దాడి చేయడంతో ఈ ఘర్షణలు మొదలయ్యాయి. దాంతో ఇరాన్‌లో అమెరికా దాడులు.. అందుకు ప్రతిగా గల్ఫ్‌లోని అగ్రరాజ్య సైనిక స్థావరాలను ఇరాన్ టార్గెట్ చేయడంతో హర్మూజ్ జలసంధి మరోసారి ఘర్షణలకు కేంద్రబిందువైంది. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. హర్మూజ్‌లో ప్రయాణించే నౌకల నుంచి.. వాటిలోని సరకు విలువలో 20% టోల్ వసూలు చేస్తామని ప్రకటించారు. హర్మూజ్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించబోమని, నౌకల రాకపోకలకు అంతరాయం కలిగిస్తే బలప్రయోగానికి దిగుతామని హెచ్చరించింది.







