Su-57 యుద్ధ విమానాల అభివృద్ధికి భారత్‌కు రష్యా ఆఫర్‌

న్యూఢిల్లీ/సెయింట్‌పీటర్స్‌బర్గ్‌: భారత వైమానిక దళాన్ని ఆధునికీకరించే క్రమంలో ఐదోతరం యుద్ధ విమానాల అవసరం తీవ్రంగా ఉన్న వేళ రష్యా కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చింది. అధునాతన స్టెల్త్‌ సామర్థ్యాలు కలిగిన సుఖోయ్‌ Su-57 యుద్ధ విమానాలను భారత్‌తో కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేసి, ఉత్పత్తి చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వెల్లడించారు. ఈ సందర్భంగా కీలక సాంకేతికతలను భారత్‌తో పంచుకునేందుకు కూడా రష్యా సుముఖంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.

సెయింట్‌పీటర్స్‌బర్గ్‌లో అంతర్జాతీయ వార్తాసంస్థల అధినేతలతో జరిగిన సమావేశంలో పుతిన్‌ ఈ ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. రక్షణ రంగంలో రష్యా–భారత్‌ సంబంధాలపై ఎలాంటి పరిమితులు లేవని, ఇరు దేశాల మధ్య సహకారం మరింత విస్తరించేందుకు మాస్కో సిద్ధంగా ఉందని ఆయన పేర్కొన్నారు. సాంకేతికత బదిలీ విషయంలో పాశ్చాత్య దేశాలు విధించే ఆంక్షలను పరోక్షంగా విమర్శిస్తూ, రష్యా మాత్రం భారత్‌తో ఆ స్థాయిలో ఆంక్షలు లేకుండా పనిచేయడానికి సిద్ధమని పుతిన్‌ స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రస్తుతం భారత వైమానిక దళంలో ఐదోతరం యుద్ధ విమానాలు లేవు. ఇదే సమయంలో పాకిస్థాన్‌ త్వరలో చైనాకు చెందిన షెన్‌యాంగ్‌ J-35AE స్టెల్త్‌ ఫైటర్లను పొందబోతున్నట్లు వస్తున్న వార్తల నడుమ రష్యా నుంచి వచ్చిన ఈ ప్రతిపాదన ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రాంతీయ శక్తి సమీకరణాల దృష్ట్యా కూడా ఇది కీలక పరిణామంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Su-57 సంయుక్త అభివృద్ధి అంశంపై భారత్‌కు ఇది తొలి ఆఫర్‌ కాదు. గతంలోనే ఈ ఫైటర్‌ జెట్‌ ప్రాజెక్టులో భాగస్వామ్యం కావాల్సిందిగా రష్యా ప్రతిపాదించగా, 2018లో ఇరు దేశాల మధ్య చర్చలు కూడా జరిగాయి. అయితే ఆ సమయంలో ఆ యుద్ధ విమానం భారత వైమానిక దళం పూర్తి స్థాయి కార్యాచరణ అవసరాలను తీరించలేదని ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ అంచనా వేయడంతో భారత్‌ ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది.

ఇదిలాఉంటే, స్వదేశీ సాంకేతికతతో ఐదోతరం యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేయడానికి భారత్‌ ఇప్పటికే అడుగులు వేసింది. ‘అడ్వాన్స్‌డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌’ (AMCA) పేరుతో కొనసాగుతున్న ప్రాజెక్టు ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉంది. 2030 మధ్యకాలంలో ఈ స్వదేశీ జెట్‌ భారత వైమానిక దళంలో చేరే అవకాశమున్నట్లు రక్షణ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్‌–చైనా సంబంధాలపై కూడా పుతిన్‌ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సరిహద్దు వివాదంలో రష్యా జోక్యం చేసుకునే ఉద్దేశ్యం లేదని ఆయన స్పష్టం చేశారు. భారత్‌, చైనా తమ సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటాయనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.

2030లో తాను మరోసారి ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ప్రశ్నించగా, ఆ విషయంపై ఇప్పుడు మాట్లాడటం తొందరపాటు అవుతుందని పుతిన్‌ వ్యాఖ్యానించారు. అప్పటికి తన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదని, ప్రస్తుతం పరిష్కరించాల్సిన అనేక అంతర్గత, బాహ్య అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉందని ఆయన తెలిపారు.