పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా సైన్యం వరుసగా 11వ రాత్రి కూడా వైమానిక దాడులు నిర్వహించింది. హోర్ముజ్ జలసంధిపై ఆధిపత్య పోరాటం కోసం ఇరు దేశాలు దాడులకు దిగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు జరుగుతున్న దౌత్య ప్రయత్నాలపై ఈ దాడులు ప్రభావం చూపుతున్నాయి.

ఒకవైపు పాకిస్థాన్ మధ్యవర్తిత్వంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని పునరుద్ధరించేందుకు దౌత్య చర్చలు కొనసాగుతున్నాయి. ఇరాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి ఎస్కందర్ మొమెని తాజాగా పాకిస్థాన్‌ను అధికారికంగా సందర్శించారు. ఈ పర్యటనలో ఆయన పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌, ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్‌తో సమావేశమయ్యారు. సరిహద్దు భద్రత, ద్వైపాక్షిక వాణిజ్యం, ప్రాంతీయ భద్రత, అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితులపై చర్చించారు. అమెరికాతో కాల్పుల విరమణ గురించి కూడా ఎస్కందర్ చర్చలు జరిపినట్టు సమాచారం. మరోవైపు ఇరాన్‌తో శాంతి చర్చలపై ప్రస్తుతానికి ఆసక్తి లేదని మంగళవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరాన్‌పై అమెరికా సైన్యం దాడులు చేస్తూనే ఉంది. కాగా, తాజా దాడుల్లో ఏ లక్ష్యాలను గురి చేసిందనే విషయాన్ని అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించలేదు.