భారత్‌-నేపాల్‌ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (SSB) మరో అమెరికన్‌ను అదుపులోకి తీసుకుంది. మణిపుర్‌లో అమెరికా డ్రోన్ నిపుణుడు మాథ్యూ వాన్‌డైక్‌ను ఇటీవల భారత సైన్యం అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సరిహద్దుల వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న అమెరికా మాజీ సైనికుడిని ఎస్‌ఎస్‌బి అదుపులోకి తీసుకుంది. అతడిని కాలిఫోర్నియాకు చెందిన జోర్డాన్‌ బ్రౌన్‌గా గుర్తించారు. సరైన ప్రయాణ పత్రాలు లేకుండా నేపాల్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా అతడిని ఎస్‌ఎస్‌బి జవాన్ అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. జవాన్‌ నుంచి తప్పించుకొని పారిపోతుండగా.. స్థానికులు పట్టుకొని భద్రతా సిబ్బందికి అప్పగించారన్నారు.

విచారణ సమయంలో బ్రౌన్ పొంతన లేని సమాధానాలు చెప్తున్నాడని అధికారులు తెలిపారు. బ్రౌన్ 2025 నవంబర్‌లో సముద్ర మార్గం ద్వారా భారత్‌లోకి ప్రవేశించి.. అప్పటి నుంచి గోవాలో నివసిస్తున్నట్లు గుర్తించామన్నారు. సరైన పత్రాలు లేకుండా భారత్‌లోకి ప్రవేశించినందుకు ఇమిగ్రేషన్‌ అధికారులు అతడిపై కేసు నమోదు చేశారు. విచారణలో అతడు బెంగళూరు, లఖ్‌నవూ, గోరఖ్‌పూర్‌లకు వెళ్లినట్లు తేలిందన్నారు. తాను కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చదువుకున్నానని.. ఆరేళ్లపాటు అమెరికా సైన్యంలో పని చేశానని బ్రౌన్‌ వెల్లడించారు. రెండేళ్ల క్రితం సైన్యం నుంచి వైదొలిగానన్నారు. 

మూడేళ్ల క్రితం తాను ఇటలీ పర్యటనలో ఉన్న సమయంలో ఉత్తరాఖండ్‌కు చెందిన ఒక భారతీయ మహిళను కలిశానని.. 2024 అక్టోబర్‌లో ఆమెను వివాహం చేసుకున్నానని తెలిపారు. అనంతరం టూరిస్ట్ వీసాపై థాయ్‌లాండ్‌ వెళ్లానని.. అక్కడ పాస్‌పోర్టు పోవడంతో తాను సముద్ర మార్గంలో భారత్‌కు వచ్చినట్లు వెల్లడించారు. గోవాలో పరిచయమైన ఓ నేపాల్‌ వ్యక్తిని కలవడానికి ఆ దేశానికి వెళ్తున్నట్లు పేర్కొన్నారు. పాస్‌పోర్ట్‌ గురించి ప్రశ్నించగా బెంగళూరులోని ఓ పరిచయస్థుడి వద్ద ఉందని చెప్పారు.