రాయలసీమ న్యూస్, కర్ణాటక డెస్క్: దేశంలో రెండవ వందే భారత్ స్లీపర్ రైలు బెంగళూరుకు చేరుకుని రైల్వే ప్రయాణికుల దృష్టిని ఆకర్షిస్తోంది. రాత్రి ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా, సుఖవంతంగా మార్చేందుకు భారతీయ రైల్వే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఈ స్లీపర్ రైలు ప్రస్తుతం సర్ ఎం. విశ్వేశ్వరయ్య టెర్మినల్ బెంగళూరు స్టేషన్‌లో తుది తనిఖీలు, ట్రయల్ రన్స్ కోసం నిలిపి ఉంచారు.
చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ సాంకేతిక సహకారంతో, బెంగళూరుకు చెందిన పబ్లిక్ సెక్టార్ సంస్థ BEML లిమిటెడ్ ఈ హైటెక్ రైలును పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేసింది. ఆకర్షణీయమైన నారింజ, బూడిద రంగుల కలయికతో రూపొందించిన కొత్త లుక్ ఈ రైలుకు ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఈ సరికొత్త స్లీపర్ సర్వీస్ ఐటీ హబ్ బెంగళూరును దేశ ఆర్థిక రాజధాని ముంబైతో అనుసంధానించనుంది. కా్రాంతివీర సంగొల్లి రాయణ్ణ స్టేషన్ నుంచి బయలుదేరే ఈ రైలు, హుబ్బళ్లి-ధార్వాడ్, బెలగావి, పుణే మీదుగా ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వరకు నడవనుంది.
ప్రస్తుతం బెంగళూరు–ముంబై మధ్య నడుస్తున్న ఎక్స్‌ప్రెస్ రైళ్లు దాదాపు 22 గంటల ప్రయాణ సమయం తీసుకుంటున్నాయి. కొత్త వందే భారత్ స్లీపర్ రైలు ద్వారా ఈ ప్రయాణ సమయం 16 నుండి 17 గంటలకు తగ్గనుంది. దీంతో ప్రయాణికులకు సుమారు 5 గంటల సమయం ఆదా కానుంది.
16 కోచ్‌లతో రూపొందించిన ఈ సెమీ-హైస్పీడ్ రైలు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా డిజైన్ చేశారు. మొత్తం కోచ్‌లు ఎయిర్ కండిషన్డ్‌గా ఉండగా, వీటిలో 11 థర్డ్ ఏసీ, 4 సెకండ్ ఏసీ, 1 ఫస్ట్ ఏసీ కోచ్‌లు ఉన్నాయి. మొత్తం 823 మంది ప్రయాణికులు ఈ రైలులో ప్రయాణించే వీలుంది.
ప్రయాణికుల సౌకర్యం దృష్ట్యా ఎర్గోనామిక్ డిజైన్‌తో కూడిన కుషన్ బెర్తులు ఏర్పాటు చేశారు. ఆటోమేటిక్ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ ప్లగ్ డోర్లు, శబ్ద కాలుష్యాన్ని తగ్గించే అత్యాధునిక సస్పెన్షన్ సిస్టమ్, సెన్సార్ ఆధారిత వాటర్ టాప్స్, బయో-వాక్యూమ్ టాయిలెట్లు ఈ రైలులో ముఖ్యమైన సౌకర్యాలుగా ఉన్నాయి.
రైళ్ల ముఖాముఖి ఢీకొట్టుకోవడాన్ని నివారించే ‘కవచ్’ యాంటీ-కొలిజన్ టెక్నాలజీతో ఈ రైలును అమర్చారు. అత్యవసర పరిస్థితుల్లో డ్రైవర్‌తో మాట్లాడేందుకు ‘ఎమర్జెన్సీ టాక్-బ్యాక్ సిస్టమ్’ను ఏర్పాటు చేశారు. అదనంగా, ప్రయాణికుల భద్రత కోసం సీసీటీవీ కెమెరాలు కూడా అమర్చారు.
బెంగళూరు–ముంబై మార్గంలో వందే భారత్ స్లీపర్ రైలు ప్రవేశంతో రాత్రి ప్రయాణం మరింత వేగవంతం, సురక్షితం, సౌకర్యవంతం కానుందని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. తుది తనిఖీలు, ట్రయల్ రన్స్ పూర్తయిన తర్వాత వాణిజ్య సర్వీసు ప్రారంభ తేదీని భారతీయ రైల్వే ప్రకటించనుంది.







