రాయలసీమ న్యూస్, కర్నూలు: కోడుమూరు నుంచి కర్నూలు వెళ్తున్న ప్రధాన రహదారిపై పెద్దపాడు గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. రహదారిపై యువకుడు మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
సూచన అందుకున్న వెంటనే కె.నాగలాపురం పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ అఖిల్‌కుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. రహదారి మధ్యలో పడివున్న మృతదేహాన్ని పరిశీలించిన అనంతరం అక్కడి పరిస్థితులు, గాయాల స్వరూపం ఆధారంగా ఇది రోడ్డు ప్రమాదంగా కనిపిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
ఎస్‌ఐ అఖిల్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో యువకుడు మృతి చెంది ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయానికి అక్కడ ఇతరులు లేకపోవడంతో వాహనం వివరాలు, దిశ ఇంకా తెలియరాలేదని పోలీసులు తెలిపారు.
మృతుడి వయస్సు సుమారు 22 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉంటుందని ఎస్‌ఐ పేర్కొన్నారు. ప్రమాద సమయంలో అతడు గ్రే, నీలం రంగుల ఫుల్ టీషర్ట్, నలుపు రంగు ప్యాంటు ధరించి ఉన్నట్లు తెలిపారు. మృతుడి జేబులో ఉన్న మొబైల్ ఫోన్ కూడా ప్రమాదంలో పగిలిపోయినట్లు పోలీసులు గుర్తించారు.
యువకుడి వద్ద గుర్తింపు పత్రాలు ఏవీ లభించకపోవడంతో అతని వివరాలు ఇంకా తెలియరాలేదని ఎస్‌ఐ చెప్పారు. మృతుడి కుటుంబ సభ్యులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలకు, ప్రయాణికులకు మృతుడి వివరాలు తెలిసిన వారు ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
మృతుడి వివరాలు తెలిసిన వారు లేదా ప్రమాదాన్ని ప్రత్యక్షంగా గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ అఖిల్‌కుమార్ కోరారు. ఇందుకోసం సెల్ నంబర్ 91211 01068కు ఫోన్ చేసి సమాచారం అందించాలని ఆయన ప్రజలను అభ్యర్థించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.













