రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు: నగరంలో రహదారులను ఆక్రమించి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం, వాహనదారుల భద్రతకు ముప్పు కలిగించడం ఏమాత్రం సబబు కాదని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు పేర్కొన్నారు. శనివారం బళ్లారి చౌరస్తా వద్ద 44వ జాతీయ రహదారి సర్వీస్ రహదారిపై ఉన్న ఆక్రమణలను అధికారులు తొలగించారు.
రహదారిపై ఉంచిన టైర్లు, శాశ్వత నిర్మాణాలను వెంటనే స్వచ్ఛందంగా తొలగించుకోవాలని ఆక్రమణదారులను కమిషనర్ హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే ఎలాంటి రాజీ లేకుండా ఆక్రమణలను తొలగించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ, నగరంలో వాహనదారులకు ఎదురవుతున్న ట్రాఫిక్ ఇబ్బందులు, రహదారులపై జరుగుతున్న ప్రమాదాలను వాణిజ్య దుకాణదారులు గ్రహించాలని సూచించారు. సామాజిక బాధ్యతగా రహదారులపై ఆక్రమణలకు పాల్పడకుండా సహకరించాల్సిన అవసరం ఉందని తెలిపారు.
ట్రాఫిక్ సజావుగా సాగేందుకు, వాహనదారులు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు రహదారులను ఆక్రమించకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కమిషనర్ పేర్కొన్నారు. ప్రజల ప్రాణ భద్రత, ట్రాఫిక్ నిర్వహణ దృష్ట్యా రహదారి ఆక్రమణలపై కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు.
ఆక్రమణల తొలగింపు కార్యక్రమం అనంతరం కమిషనర్ విష్ణు టౌన్‌షిప్‌లో మురుగు కాలువలో తాగునీటి పైప్‌లైన్ మార్పు పనులు జరుగుతున్న ప్రదేశాన్ని పరిశీలించారు. పనుల పురోగతిని తెలుసుకుని, సమయానికి నాణ్యంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు ఇచ్చారు.
తదుపరి పందిపాడులో నిర్మాణంలో ఉన్న నూతన డ్రెయిన్‌ను పరిశీలించిన కమిషనర్, వర్షాకాలంలో నీటి నిల్వలు, మురుగు సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇంజనీరింగ్ విభాగానికి సూచించారు.
నందికొట్కూరు రోడ్డులోని డిమార్ట్ సమీపంలో పిజిఆర్‌యస్ ఫిర్యాదు చేసిన ప్రాంతాన్ని కమిషనర్ పరిశీలించారు. అక్కడి పరిస్థితులను ప్రత్యక్షంగా గమనించి, సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ముజఫర్ నగర్ నూతన రైతు బజార్‌ను సందర్శించిన కమిషనర్ చల్లా ఓబులేసు, అక్కడ డస్ట్ బిన్‌లు ఏర్పాటు, పరిసరాల పరిశుభ్రతపై వ్యాపారులు, రైతులకు అవగాహన కల్పించారు. ప్రజా ఆరోగ్యం దృష్ట్యా పరిశుభ్రతపై ఎలాంటి నిర్లక్ష్యం సహించబోమని స్పష్టం చేశారు.
సెట్కూర్ కార్యాలయం వద్దనున్న అన్న క్యాంటీన్‌ను కూడా కమిషనర్ తనిఖీ చేశారు. అక్కడి వంటశాల, భోజనశాల పరిశుభ్రత, ఆహార నాణ్యతపై వివరాలు తెలుసుకుని, అవసరమైన సూచనలు చేశారు.
ఈ కార్యక్రమాల్లో ఏఈలు ప్రవీణ్ కుమార్ రెడ్డి, జనార్ధన్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు ఎంజల్ ప్రణీత, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలో రహదారి ఆక్రమణల నిర్మూలన, పరిశుభ్రత, మౌలిక వసతుల మెరుగుదల కోసం మున్సిపల్ అధికారులు చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు.













