కర్నూలు: 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణలకు వామపక్ష పార్టీలు ఘనంగా నివాళులర్పించాయి. CPI, CPI(M), CPI(ML) Liberation, SUCI పార్టీల ఆధ్వర్యంలో అమరుల చిత్రపటాలకు పూలమాలలు అర్పించి, మౌనం పాటించారు.

ఈ కార్యక్రమానికి వామపక్ష నాయకులు టి. రాముడు, సి. మహేష్‌లు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా CPI రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కే. రామాంజనేయులు, CPI(M) జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్, CPI(ML) Liberation జిల్లా నాయకుడు ఎస్.ఎన్. రసూల్, SUCI నాయకుడు నాగన్న పాల్గొన్నారు.

వామపక్ష నాయకులు మాట్లాడుతూ 2000 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారని, ఆ సమయంలో విద్యుత్ చార్జీల పెంపుకు వ్యతిరేకంగా దాదాపు సంవత్సరం పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉధృతంగా ఉద్యమం సాగిందని గుర్తుచేశారు. ఆ విద్యుత్ ఉద్యమం రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచేలా ఉందని పేర్కొన్నారు.

చలో హైదరాబాద్ కార్యక్రమం సందర్భంగా బషీర్ బాగ్‌లో వామపక్ష కార్యకర్తలు, నాయకులపై విచక్షణారహితంగా లాఠీచార్జ్ చేసినట్లు, గుర్రాలతో తొక్కించినట్లు, తుపాకీ కాల్పులు జరిపి ముగ్గురు కార్యకర్తలను హతమార్చిన ఘటనకు నారా చంద్రబాబు నాయుడు పాలనలో చోటుచేసుకున్న నల్ల అధ్యాయంగా చరిత్రలో నిలిచిపోయిందని వారు వ్యాఖ్యానించారు.

విష్ణువర్ధన్ రెడ్డి, బాలస్వామి, రామకృష్ణల బలిదానం వృథా కాలేదని, వారి త్యాగస్ఫూర్తి ఇప్పటికీ ప్రజల్లో, ఉద్యమకారుల్లో సజీవంగా ఉందని నాయకులు తెలిపారు. ప్రస్తుతం మళ్లీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ సమయంలో స్మార్ట్ మీటర్ల రూపంలో విద్యుత్ చార్జీలను పెంచేందుకు ప్రభుత్వం పరోక్షంగా ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు.

స్మార్ట్ మీటర్ల వ్యవస్థ ద్వారా విద్యుత్ రంగాన్ని కార్పొరేట్ సంస్థలైన Adani, Ambani లకు అనుకూలంగా మలచాలని ప్రభుత్వం చూస్తోందని వామపక్షాలు విమర్శించాయి. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ, చాలా తక్కువ వ్యయంతో యూనిట్‌కు సుమారు ఒక రూపాయికి విద్యుత్ ఉత్పత్తి అవుతుండగా, వినియోగదారులకు చేరే సమయానికి యూనిట్‌కు ఏడు నుంచి 14 రూపాయల వరకు వసూలు చేస్తూ ప్రజలను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటికైనా ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్ల విధానాన్ని ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో మరోసారి విద్యుత్ ఉద్యమానికి సిద్ధమవుతామని వామపక్ష నాయకులు హెచ్చరించారు.

కార్యక్రమంలో CPI జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. మునెప్ప, నగర నాయకులు బిసన్న, అన్వర్, నల్లన చేశారు, సి. కుమార్, విద్యార్థి నాయకుడు అశోక్, CPI(M) నగర కార్యదర్శి రాజశేఖర్, CPI(M) జిల్లా నాయకులు P.S. రాధాకృష్ణ, ఆనంద్ బాబు, ప్రజానాట్యమండలి నాయకులు నాగరాజు, జి. మహేంద్ర తదితరులు పాల్గొన్నారు.