రాయలసీమ న్యూస్, కర్నూలు: పత్తికొండ: పత్తికొండ పట్టణంలోని గుత్తి బైపాస్ రోడ్డు నుంచి రామచంద్రపురం రోడ్డులోపల ఉన్న పొలంలో వెలిసిన శ్రీ నాగమ్మ అవ్వ ఆలయ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక భక్తులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి పత్తికొండ శాసనసభ్యులు కేఈ శ్యాంబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భూమి పూజ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబు, టీటీడీ ఎస్టిమేంట్ ఇంజనీర్ నవీన్ చేతుల మీదుగా ఆలయ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.
శ్రీ నాగమ్మ అవ్వ ఆలయ అభివృద్ధి శ్రీ వాణి ట్రస్ట్ సహకారంతో చేపట్టడం జరుగుతోంది. హిందూ దేవాలయాలను అభివృద్ధి చేయడం, పురాతన దేవాలయాలు, గ్రామీణ ప్రాంతాల్లోని ఆలయాలకు మరింత ప్రోత్సాహం అందించడం లక్ష్యంగా శ్రీ వాణి ట్రస్ట్ ద్వారా వివిధ దేవాలయాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.
ఆ కార్యక్రమాల పరంపరలో భాగంగానే పత్తికొండలో శ్రీ నాగమ్మ అవ్వ ఆలయ నిర్మాణానికి కూడా ఆ ట్రస్ట్ నుంచి సహకారం అందుతోంది. ఆలయ నిర్మాణం పూర్తయిన అనంతరం భక్తులకు ఆధ్యాత్మికంగా ఎంతో ఉపయోగకరంగా ఉండబోతోందని నిర్వాహకులు పేర్కొన్నారు.
భవిష్యత్తులో ఆలయం మరింత అభివృద్ధి చెందేలా అందరి సహకారం అవసరమని, ఆలయ నిర్మాణానికి భక్తులు, దాతలు తమ వంతు సహాయ సహకారాలు అందించాలని నిర్వాహకులు కోరారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కార్యక్రమం సజావుగా సాగింది.
అదే విధంగా మాదాసి మాదారి కురువ తాలూకా అధ్యక్షులు పుండుకూర బ్రహ్మయ్య చేతుల మీదుగా కూడా పూజా కార్యక్రమం నిర్వహించారు. భూమి పూజ అనంతరం పాల్గొన్న అతిథులకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు యువత అధికార నరసింహ చౌదరి, ప్రతినిధి బత్తిని లోకనాథ్, రాష్ట్ర ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ వెంకటపతి, హరినాథ్, కడవల సుధాకర్, తెలుగు మహిళ అధ్యక్షురాలు ఈరమ్మ, బీజేపీ మండల అధ్యక్షుడు కరణం నరేష్, గోరవయ్య మైలారు, కైరుప్పల ఉరుకుందు, శ్రీరాములు, శ్రీనాథ్, వినోద్, రాజేష్, రంగస్వామి, రామాంజనేయులు, నాగరాజు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.













