రాయలసీమ న్యూస్, కర్నూలు: కర్నూలు: జిల్లాలో రైతులు ఒకే పంట సాగు చేసే విధానాన్ని తగ్గించి, మిశ్రమ, అంతర పంటల సాగు, పీఎండీఎస్ విధానాలను విస్తృతంగా ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ నుండి నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో వ్యవసాయ రంగానికి సంబంధించిన పీఎండీఎస్ అమలు, మోనోక్రాపింగ్ స్థానంలో అంతర పంటల సాగు, బీడు భూముల వినియోగం, విత్తన సాగు, డ్రిప్ ఇరిగేషన్, మిర్చి, పశుగ్రాసం సాగు తదితర అంశాలపై కలెక్టర్ సమగ్రంగా సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నిర్దేశించిన లక్ష్యాల మేరకు పీఎండీఎస్, అంతర పంటల సాగు సాధించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు నివేదిస్తున్న గణాంకాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితులను స్పష్టంగా ప్రతిబింబించేలా ఉండాలని సూచించారు. జిల్లాలోని అన్ని మండలాల అధికారులు క్రమం తప్పకుండా క్షేత్రస్థాయి పర్యటనలు నిర్వహించి, పీఎండీఎస్ అమలు, అంతర పంటల సాగు, పంటల పరిస్థితి, రైతుల స్పందనపై వాస్తవ సమాచారాన్ని అందించాలని ఆమె ఆదేశించారు.
సపోటా, అరటి వంటి ఉద్యాన పంటలు సాగవుతున్న ప్రాంతాల్లో పీఎండీఎస్ అమలు పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో మోనోక్రాపింగ్ విధానాన్ని తగ్గించి, రైతులను మిల్లెట్స్, పప్పుధాన్యాలు, నూనెగింజలు తదితర అంతర పంటల సాగు వైపు ప్రోత్సహించడంతో క్షేత్రస్థాయిలో గణనీయమైన మార్పు కనిపిస్తోందని వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు.
కొర్ర, జొన్న, సజ్జ, నువ్వులు, ఆవాలు, కందులు, పెసలు, ఉలవలు, అలసందలు తదితర పంటలను రైతులు సాగు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా పత్తి ప్రధాన పంటగా ఉన్న ప్రాంతాల్లో కందులు, జొన్నలు, సజ్జలు, కొర్రలు, ఇతర పప్పుధాన్యాలను అంతర పంటలుగా ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. వర్షాభావ పరిస్థితులు, దీర్ఘకాలిక వర్ష విరామాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో పంటలు తేమ ఒత్తిడి, ఎదుగుదల మందగింపు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నాయని చెప్పారు.
ముఖ్యంగా వర్షాధార పత్తి పంటల పరిస్థితిపై మండలాల వారీగా సమీక్ష చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వర్షపాతం లోటు, పంటల స్థితిగతులు, దిగుబడి అంచనాలు, రైతుల అభిప్రాయాలను నిరంతరం పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు. పీఎండీఎస్ అమలు చేసిన ప్రాంతాల్లో పంటల నిలకడ, రైతులకు కలిగిన ప్రయోజనాలు, విజయవంతమైన సాగు విధానాలపై వివరాలను సేకరించాలని సూచించారు. ఆయా విజయవంతమైన విధానాలను విజయగాథలుగా రూపొందించి విస్తృత ప్రచారం చేయాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు.
ఉద్యాన శాఖ, ఏపీఎంఐపీ అధికారులతో డ్రిప్ ఇరిగేషన్ కవరేజ్‌పై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. గత పది రోజుల్లో నమోదైన అదనపు కవరేజ్, మండలాల వారీ పురోగతిని పరిశీలించి, తక్కువ పురోగతి ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. అందుబాటులో ఉన్న దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించి, తదుపరి సమీక్ష నాటికి మెరుగైన పురోగతి సాధించాలని అధికారులను ఆదేశించారు.
ప్రతి మండలానికి సంబంధించి మొత్తం సాగు విస్తీర్ణం, పీఎండీఎస్ కింద కవరైన విస్తీర్ణం, అంతర పంటల సాగు, మొలకెత్తిన పంటల పరిస్థితి, రైతుల స్పందన తదితర వివరాలను ఒక్కొక్క అధికారి సమగ్రంగా సమర్పించాలని కలెక్టర్ సూచించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు నష్టపోకుండా ఉండేందుకు పంటల బీమా నమోదు, పంటల క్షేత్రస్థాయి పరిశీలనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆమె పేర్కొన్నారు.
వర్షాధార ప్రాంతాల్లో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై ముందస్తుగా అవగాహన కల్పించాలని, వచ్చే వ్యవసాయ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి నుంచే సరైన పంట ప్రణాళిక, మిశ్రమ మరియు అంతర పంటల సాగు, నీటి సంరక్షణ పద్ధతులపై విస్తృత అవగాహన కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పీఎండీఎస్, అంతర పంటల సాగు ద్వారా రైతులకు అదనపు ఆదాయం చేకూర్చే అవకాశాలను విస్తృతంగా వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
వివిధ మండలాల్లో పంటల పరిస్థితి, వర్షాభావ ప్రభావం, దిగుబడి అంచనాలు, ఉద్యాన పంటలతో అంతర పంటల సాగు, పీఎండీఎస్ అమలు పురోగతిని వేగవంతం చేయాలని కలెక్టర్ పేర్కొన్నారు. పీఎండీఎస్ ద్వారా పంటల రక్షణతో పాటు రైతులకు అదనపు ఆదాయం సమకూరేలా క్షేత్రస్థాయిలో చర్యలు ముమ్మరం చేయాలని ఆమె ఆదేశించారు. టెలికాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వరలక్ష్మి, ఉద్యాన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రాజా కృష్ణా రెడ్డి, ఏపీఎంఐపీ పిడి శ్రీనివాసులు, పశువర్ధక శాఖ అధికారి డా. రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.













