కర్నూలు నగరంలో సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా అరికట్టేందుకు నగరపాలక సంస్థ చర్యలను ముమ్మరం చేసింది. పర్యావరణం, ప్రజారోగ్యానికి హానికరమైన నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగంపై ప్రత్యేక దాడులు నిర్వహిస్తూ, భారీగా జరిమానాలు విధిస్తున్నట్లు నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు.

సోమవారం కమిషనర్ చల్లా ఓబులేసు పాత బస్టాండ్‌ పరిసర ప్రాంతంలోని దుకాణాలను సందర్శించారు. అక్కడ వ్యాపారులతో సమావేశమై సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించే అవసరాన్ని వివరించి, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.

కమిషనర్ చల్లా ఓబులేసు మాట్లాడుతూ, నగరంలో ప్లాస్టిక్‌ విక్రయాలు, వినియోగాన్ని వ్యాపారులు, ప్రజలు స్వచ్ఛందంగా పూర్తిగా నిలిపివేయాలని కోరారు. నిషేధిత ప్లాస్టిక్‌ వినియోగాన్ని అరికట్టేందుకు నగరపాలక సంస్థ నిరంతరం ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తోందని ఆయన తెలిపారు.

ఈ ఏడాదిలో ఇప్పటివరకు 201 దాడులు నిర్వహించి, 250 కిలోలకు పైగా నిషేధిత ప్లాస్టిక్‌ను స్వాధీనం చేసుకున్నట్లు కమిషనర్ వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మొత్తం రూ.1,95,150 జరిమానాలు విధించినట్లు పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ వినియోగంపై నగరపాలక సంస్థ కఠినంగా వ్యవహరిస్తోందని, ఇకపై కూడా తనిఖీలను మరింత కఠినతరం చేయనున్నట్లు సూచించారు.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని కమిషనర్ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు. ప్లాస్టిక్‌కు బదులుగా వస్త్ర సంచులు, కాగిత సంచులు వంటి పర్యావరణ హిత ప్రత్యామ్నాయాలను వినియోగించాలని వ్యాపారులు, ప్రజలకు సూచించారు. ప్రతి వ్యాపార సంస్థ తమ దుకాణం ముందు తప్పనిసరిగా డస్ట్‌బిన్‌ ఏర్పాటు చేసుకోవాలని, చెత్తను రోడ్లపై వేయకుండా ఆ డస్ట్‌బిన్‌లలోనే వేయాలని ఆయన సూచించారు.

నగర పరిశుభ్రతకు ప్రతి వ్యాపారి భాగస్వామి కావాలని కమిషనర్ అభిప్రాయపడ్డారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్లాస్టిక్‌ నిషేధం, పారిశుద్ధ్య నిర్వహణపై నగరపాలక సంస్థ చేపట్టిన చర్యలకు ప్రజలు, వ్యాపారులు సహకరించాలని ఆయన కోరారు.

అంతకుముందు సుంకేసుల రోడ్డు, ఎన్.ఆర్.పేట తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్య నిర్వహణను కమిషనర్ చల్లా ఓబులేసు ప్రత్యక్షంగా పరిశీలించారు. అక్కడి పరిస్థితులపై అధికారులతో సమీక్ష నిర్వహించి, అవసరమైన సూచనలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలోని అన్న క్యాంటీన్‌ను సందర్శించి, అక్కడ అందిస్తున్న సేవలను పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘు, సానిటరీ సూపర్వైజర్ రమేష్, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు మల్లికార్జున, లోకేష్ తదితరులు పాల్గొన్నారు. కర్నూలు నగరాన్ని ప్లాస్టిక్‌ రహితంగా, పరిశుభ్రంగా మార్చేందుకు నగరపాలక సంస్థ చర్యలు కొనసాగుతున్నాయి.