రాయలసీమ న్యూస్, కర్నూలు: ఎమ్మిగనూరు పట్టణంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. ఈ ప్రచారానికి ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి జోరు పెంచారు. మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి శ్రీమతి మాచాని సునీతతో కలిసి పట్టణంలోని వివిధ వార్డుల్లో పర్యటిస్తూ, కూటమి తరఫున పోటీ చేస్తున్న కౌన్సిలర్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

ఈ క్రమంలో 26వ వార్డు మిలటరీ కాలనీ, శిల్పా ఎస్టేట్ ప్రాంతాల్లో శ్రీమతి భాస్కర్ల సుభద్రమ్మ తరఫున, 25వ వార్డు టిబిపి కాలనీలో శ్రీ వీజీ కృష్ణ తేజ నాయుడు తరఫున, 23వ వార్డు లక్ష్మణ్ టాకీస్, సాయిగణేష్ కాలనీ పరిధిలో శ్రీమతి జీఈ జయలక్ష్మి తరఫున ఎమ్మెల్యే పర్యటించి, ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. అభ్యర్థుల అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి, వారికి ఓట్లు వేయాలని కోరారు.

ప్రచార సభల్లో మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి, గత వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రజలపై విధించిన చెత్త పన్ను, అమ్మఒడి పథకం అమలులో ఎదురైన సమస్యలను ప్రస్తావించారు. ఆ కాలంలో ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులను గుర్తుచేస్తూ, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అండగా నిలుస్తున్నాయని ఆయన తెలిపారు.

ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధి కార్యక్రమాలపై వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే, రూ.157 కోట్ల వ్యయంతో 24 గంటల తాగునీటి ప్రాజెక్టు, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు మౌలిక వసతులు గణనీయంగా మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు.

అలాగే బనవాసి సమీపంలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్ హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్ పార్క్ ద్వారా చేనేత రంగానికి బలం చేకూరుతుందని ఎమ్మెల్యే వివరించారు. ఈ పార్క్ స్థాపనతో మహిళలు, యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు లభించి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఎమ్మిగనూరు పట్టణ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, ఉపాధి అవకాశాల కల్పన కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. అభివృద్ధి కొనసాగాలంటే, సంక్షేమ కార్యక్రమాలు నిరంతరంగా అమలవాలంటే కూటమికి మద్దతు అవసరమని ఆయన ప్రచారంలో స్పష్టం చేశారు.
“మీ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకే.. ఒకటి వార్డు కౌన్సిలర్ అభ్యర్థికి, మరొకటి మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థికి. అభివృద్ధికి, సంక్షేమానికి, ఎమ్మిగనూరు భవిష్యత్తుకు కూటమికి మద్దతు ఇవ్వండి” అని ఎమ్మెల్యే గారు పిలుపునిచ్చారు.














