రాయలసీమ న్యూస్, కర్నూలు: ఎమ్మిగనూరు: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా విజయాలు సాధించాలంటే రాజకీయాల్లో ఒంటెద్దు పోకడకు తావు లేకుండా, అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని వైకాపా రాష్ట్ర రైతు సంఘం అధికార ప్రతినిధి గడ్డం నారాయణరెడ్డి సూచించారు. ఎమ్మిగనూరు వైకాపా సమన్వయకర్త రాజీవ్ రెడ్డికి మీడియా ద్వారా ఆయన పలు సూచనలు చేశారు.
స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో రెబల్ అభ్యర్థిగా పోటీ చేసిన నజీర్ అహమ్మద్కు పార్టీ బీఫామ్ ఇచ్చి అధికారిక అభ్యర్థిగా ఎన్నికల బరిలో దింపి ఉంటే పార్టీకి ఎలాంటి నష్టం జరిగేది కాదని నారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. వైకాపా ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న రాజీవ్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో టిడిపి చైర్మన్ అభ్యర్థిని పొగడటంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
మన చైర్మన్ అభ్యర్థి కె ఎస్ రఘు గెలుపు కోసం పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్న సమయంలో, పార్టీలోనే అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోవడంలో రాజీవ్ రెడ్డి ఎందుకు విఫలమవుతున్నారని నారాయణరెడ్డి వ్యాఖ్యానించారు. మిట్ట సామాపురం కాల్వకు సాగునీరు మీ పొలాల కోసం తీసుకున్నవి కాదా అని ఆయన రాజీవ్ రెడ్డిని ఉద్దేశించి ప్రశ్నించారు.
రాజీవ్ రెడ్డిని రాజకీయాల్లోకి తీసుకురావాలన్న తపనతో తాను కూడా గతంలో ఎన్నో ప్రయత్నాలు చేసిన విషయాన్ని గుర్తుంచుకోవాలని నారాయణరెడ్డి సూచించారు. పార్టీ బలోపేతం కోసం స్థానిక నాయకత్వం సమన్వయంతో పని చేయాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు.
రైతు సంఘం నాయకుడిగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించకపోతే నిరాహార దీక్షకు సిద్ధమవుతానని నారాయణరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కరువు పరిస్థితుల్లో రైతులకు తగిన సహాయం అందేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జిల్లా కలెక్టర్ ఏ. సిరి నియోజకవర్గంలోని నందవరం, ఎమ్మిగనూరు మండలాల పేర్లను రెండో జాబితాకు పంపించడం హర్షణీయమని నారాయణరెడ్డి అభిప్రాయపడ్డారు. కరువు మండలాల జాబితాలో ఈ ప్రాంతాలు చేరడం ద్వారా రైతులకు ఉపశమనం కలుగుతుందని ఆయన పేర్కొన్నారు.













