రాయలసీమ న్యూస్, నంద్యాల: నంద్యాల:- కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్చుకోలేక వైకాపా తప్పుడు ప్రచారం చేస్తోందని ఎంపీ, ఎమ్మెల్యేలు, కూటమి పార్టీల నేతలు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బుధవారం స్థానిక టెక్కె మార్కెట్ యార్డులో ‘రెండేళ్ల నమ్మకం–అభివృద్ధి, సంక్షేమం’ సభను నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి మంత్రులు బీసీ జనార్దన్‌రెడ్డి, ఎన్ఎండీ.ఫరూక్, ఎంపీ డా.బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గిత్తా జయసూర్య, భూమా అఖిలప్రియ, కలెక్టర్ రాజకుమారి, జిల్లా ఎస్పీ సునీల్ షొరాణ్ తదితరులు హాజరయ్యారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి తెదేపా, జనసేన, భాజపా ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చి పాల్గొన్నారు.
సభకు ముందుగా 19 ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన అభివృద్ధి, సంక్షేమ ప్రదర్శన స్టాళ్లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, అధికారులు సందర్శించారు. అనంతరం జరిగిన సభలో కూటమి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలకు విపులంగా వివరించడంతో పాటు వైకాపా చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని నాయకులు పిలుపునిచ్చారు.
ఎంపీ డా.బైరెడ్డి శబరి మాట్లాడుతూ, రెండేళ్లలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమ ప్రాంతాల మధ్య సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రానికి రాజధాని ఏదో తెలియక వైకాపా పరిపాలించిందని, ఇతర రాష్ట్రాల ముందు అవహేళనకు గురయ్యే పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించి, లక్ష కోట్ల రూపాయలతో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధి, రహదారులు, మౌలిక వసతుల వంటి కీలక ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తోందని వివరించారు. రైతులకు సాగునీరు, ప్రజలకు తాగునీటి సౌకర్యాలు కల్పిస్తూ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం ఇస్తోందని తెలిపారు.
పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ, రైతు సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు. తుంగభద్ర జలాల విషయంలో ముఖ్యమంత్రి జోక్యంతో కేసీ.కాల్వకు నీటి విడుదల సాధ్యమైందని, గత వైకాపా ప్రభుత్వంలో గోరుకల్లు రిజర్వాయరు కుంగిపోయినా నిధులు ఇవ్వలేదని, కూటమి ప్రభుత్వం 53 కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు. అలగనూరు రిజర్వాయరును నిర్లక్ష్యం చేయడంతో అంచనాలు 32 కోట్లకు పెరిగాయని విమర్శించారు.
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రతి శుక్రవారం నియోజకవర్గంలో, ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. గ్రామ స్థాయిలో సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నామని, పింఛన్లను ఇళ్లకే వెళ్లి పంపిణీ చేయడం వంటి చర్యల ద్వారా పారదర్శక పాలన అందిస్తున్నామని తెలిపారు. ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని అన్నారు.
శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ, మహిళలకు ఉచిత బస్సు, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, పింఛన్ల పంపిణీ వంటి సంక్షేమ కార్యక్రమాలు అందరికీ సమానంగా అందుతున్నాయని, వైకాపా నాయకులు, కార్యకర్తలకూ ఇవే పథకాలు లభిస్తున్నాయని చెప్పారు. తీసుకుంటున్న వారు ఏమీ అనకపోగా, వైకాపా నాయకులు మాత్రం రోడ్లపైకి వచ్చి విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. గతంలో జరిగిన పనులు, ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమం గురించి ప్రజలు ఆలోచించాలని సూచించారు.
నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య మాట్లాడుతూ, ముఖ్యమంత్రి నాయకత్వంలో సామాజిక పింఛన్లు నాలుగు వేల రూపాయలకు పెంచినట్లు తెలిపారు. దివ్యాంగులు, డయాలసిస్ రోగులు, మంచానికే పరిమితమైన వారికి అధిక సహాయం అందుతోందని చెప్పారు. రాయలసీమ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఈ ప్రాంతాన్ని హార్టికల్చర్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. నీటి కొరత ఉన్నప్పటికీ సాగునీటిని అందించగలిగామని తెలిపారు.
భాజపా జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు మాట్లాడుతూ, కేంద్ర–రాష్ట్రాల సమన్వయంతో అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో నిర్వీర్యమైన వ్యవస్థలు ఇప్పుడు గాడిలో పడి అభివృద్ధి వైపు దూసుకుపోతున్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కృషితో పెద్దఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని, అన్ని రంగాల్లో రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం సహకరిస్తోందని తెలిపారు.
జనసేన జిల్లా అధ్యక్షుడు సురేశ్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వంపై వైకాపా అనవసర విమర్శలు చేస్తోందని అన్నారు. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు తీర్పు ఇచ్చినా వారి వ్యవహార శైలి మారలేదని వ్యాఖ్యానించారు. కూటమి ప్రభుత్వం సమన్వయంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని చెప్పారు.
కార్యక్రమంలో రాయలసీమ జోనల్ తెదేపా ఇన్‌ఛార్జి శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ఛైర్మన్ ధర్మారం సుబ్బారెడ్డి, నాగేశ్వర యాదవ్, జిల్లెల శ్రీరాములు, మార్కెట్‌యార్డు ఛైర్మన్ హరిబాబు, తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ.ఫిరోజ్, మేడా మురళీధర్, నరహరి విశ్వనాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు.













