భారత్‌లో 2030 నాటికల్లా మరో 13 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నామని అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ తాజాగా ప్రకటించారు. ప్రధాని మోదీతో సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. 2026-30 మధ్య కాలంలో భారత్‌లో 35 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ప్లాన్ చేశామని అమెరిజాన్ గతేడాదే ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రధాని మోదీతో సమావేశం వివరాలను ఆండీ జెస్సీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. ప్రధానితో సమావేశంపై హర్షం వ్యక్తం చేశారు. భారత్‌లో అమెజాన్ ప్రణాళికను ప్రధానితో పంచుకున్నానని చెప్పారు. దశాబ్దకాలంగా భారత్‌లోని వివిధ రంగాల వ్యాపారస్తులకు తాము సేవలందిస్తున్నామని అన్నారు. అయితే, ఇది ఆరంభం మాత్రమేనని అన్నారు. 2030 కల్లా మొత్తం 48 బిలియన్ డాలర్లను భారత్‌లో పెట్టుబడి పెడతామని చెప్పారు. ఇందులో ఏఐ, క్లౌడ్ మౌలిక వసతుల రూపకల్పనకు 21 బిలియన్ డాలర్లకు పైగా కేటాయిస్తామని అన్నారు.

2030 కల్లా 3.8 మిలియన్ ఉద్యోగాల సృష్టి, 80 బిలియన్ డాలర్ల ఈకామర్స్ ఎగుమతులు, చిన్న వ్యాపారాలకు, ప్రభుత్వ స్కూళ్లకు ఏఐ ప్రయోజనాలు అందించేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నామని చెప్పారు. ప్రధానితో సమావేశం సందర్భంగా అమెజాన్ గ్లోబల్ వ్యాపార కార్యకలాపాల్లో భారత్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యత గురించి వివరించారు. భారత్‌లో డిజిటల్ మౌలిక వసతుల ఏర్పాటుకు, అభివృద్ధికి అమెజాన్ కట్టుబడి ఉందని కూడా అన్నారు.