అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) కీలక ఆధారాలను సేకరించింది. ఈ విషయంపై సిద్ధం చేసిన విస్తృత నివేదికను ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వానికి సమర్పించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఏప్రిల్‌ 27 నుంచి జూన్‌ 5 వరకు విరాళాల లెక్కింపు బాధ్యతలు నిర్వర్తించిన కొంతమంది సిబ్బంది డబ్బులను అపహరించినట్లు సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించినట్టు సిట్‌ నివేదికలో పేర్కొంది.

లెక్కింపు సమయంలో కొందరు సిబ్బంది కరెన్సీ నోట్ల కట్టలను, చిల్లరను తమ దుస్తులు, జేబులు, బూట్లలో దాచిపెట్టిన దృశ్యాలు సీసీటీవీ రికార్డుల్లో నమోదయ్యాయని సిట్‌ వివరించింది. విరాళాల డబ్బును సిబ్బంది దొంగలిస్తున్నట్లు చూసిన కొందరు అధికారులు కూడా వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించకపోవడం నివేదికలో ప్రస్తావనకు వచ్చింది. నిందితులు దాదాపు 70 సార్లు దొంగతనాలకు పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టు అధికారుల సమాచారం.

దర్యాప్తు భాగంగా ట్రస్ట్‌ సభ్యులు, బ్యాంకు అధికారులు, భద్రతా సిబ్బంది, లెక్కింపు సిబ్బందిని సిట్‌ విచారించింది. వారి వాంగ్మూలాల ఆధారంగా ఏప్రిల్‌ 27కి ముందు కూడా విరాళాల చోరీ జరిగి ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేసింది. అయితే పాత సీసీటీవీ ఫుటేజ్‌ అందుబాటులో లేకపోవడం వల్ల ఆ కాలానికి సంబంధించిన ఆధారాలు సేకరించడం సవాలుగా మారిందని నివేదికలో పేర్కొంది.

మరిన్ని వివరాలు వెలికితీసేందుకు గత ఐదేళ్ల ఖాతాలను రీఆడిట్‌ చేస్తున్నట్టు సిట్‌ తెలిపింది. బ్యాంకు రికార్డులు, విరాళాల పత్రాలు, ఆలయ నిర్మాణ వ్యయాలు, బంగారం, వెండి వస్తువులతో సహా అన్ని ఆర్థిక లావాదేవీల రికార్డులను సమగ్రంగా పరిశీలిస్తున్నట్టు నివేదికలో స్పష్టం చేసింది.

అయోధ్య రామమందిరంలో భద్రతా తనిఖీలు, బయోమెట్రిక్‌ హాజరు, డిజిటల్‌ పరికరాల వినియోగంపై పరిమితులు, సీసీటీవీ పర్యవేక్షణ వంటి వ్యవస్థల్లో అనేక లోపాలు ఉన్నట్టు సిట్‌ గుర్తించింది. ఈ లోపాలను వినియోగించుకుని నిందితులు చోరీలకు పాల్పడ్డారని నివేదికలో పేర్కొంది. విలువైన కానుకల నిర్వహణ, డాక్యుమెంటేషన్‌, తూకం వేయడం వంటి ప్రక్రియల్లో కూడా విధానపరమైన లోపాలు ఉన్నాయని సిట్‌ సూచించింది.

ఈ కేసులో అవినాష్‌ శుక్లా, అనుకల్ప్‌ మిశ్రా, లవ్‌కుష్‌ మిశ్రా, మనీష్‌ కుమార్‌ యాదవ్‌, కరుణేష్‌ పాండే, రామశంకర్‌ మిశ్రాలకు ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్టు సిట్‌ నిర్ధారించింది. సీసీటీవీ దృశ్యాల్లో అవినాష్‌ శుక్లా, మనీష్‌ కుమార్‌ యాదవ్‌లు పలుమార్లు నగదు, నగలను అపహరిస్తున్న దృశ్యాలు రికార్డ్‌ అయ్యాయని నివేదికలో పేర్కొంది. ఈ ఆధారాలన్నింటిని ఆధారంగా చేసుకుని తదుపరి చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు సమాచారం.