రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి మోదీ అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు పలువురు కేంద్ర, రాష్ట్ర మంత్రులు పాల్గొన్నారు. ప్రారంభోత్సవం అనంతరం ప్రధాని మోదీ టెర్మినల్ భవనాన్ని సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విమానాశ్రయం నిర్మాణ విశేషాలు, టెర్మినల్ మాస్టర్ ప్లాన్, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలను జీఎంఆర్ ప్రతినిధులు ప్రధానికి వివరించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఈ విమానాశ్రయం కీలక మైలురాయిగా నిలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. రూ.4,727 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను నిర్మించారు. రూ.17,912 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టనున్నారు. టెర్మినల్ భవనాన్ని సందర్శిస్తూ ఆధునిక సదుపాయాలను ప్రధాని పరిశీలించారు. టెర్మినల్ సందర్శనలో భాగంగా చెక్-ఇన్ హాల్, విమానాశ్రయ రూపకల్పన, సాంకేతిక ప్రత్యేకతలను ప్రధాని మోదీకి జీఎమ్మార్ సంస్థ ప్రతినిధులు వివరించారు. ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్, ఏవియేషన్ హబ్, ఏవియేషన్ ఎడ్యుసిటీ నమూనాలను పరిశీలిస్తున్నారు.
ప్రత్యేక ఆకర్షణగా థింసా నృత్యం
విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను ప్రపంచానికి చాటిచెప్పేలా థింసా నృత్యాన్ని ప్రదర్శించారు. మొత్తం 13,750 మంది ఈ నృత్యం చేసి ప్రధానికి ఘన స్వాగతం పలికారు. అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, పోలవరం జిల్లాల నుంచి వచ్చిన గిరిజన మహిళలు, విద్యార్థినులు, మహిళా సంఘాల సభ్యులు థింసా నృత్యంలో పాల్గొన్నారు. దీని కోసం ప్రయాణికుల టెర్మినల్ భవనం నుంచి సభా వేదిక వైపు వెళ్లే మార్గంలో ప్రత్యేకంగా భారీ వేదిక ఏర్పాటు చేశారు. ప్రధాని ఓపెన్ టాప్ జీపులో బహిరంగ సభా వేదిక వద్దకు వెళుతూ ఈ నృత్యాన్ని తిలకించారు.
పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు..
బహిరంగ సభా వేదికపై నుంచే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్ - టెస్టింగ్ యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. కర్నూలులోని విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ ప్రారంభించనున్నారు. అనంతపురంలో 2500 మెగావాట్లు, కర్నూలులో 1000 మెగావాట్లు సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ పథకాలకు శ్రీకారం చుట్టనున్నారు. కర్నూలు-IV రెన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టు, పెంచలకోన–యరపాడు మధ్యన బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన శిలాఫలకాలను ఆవిష్కరించనున్నారు. ఖమ్మం – దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ నాలుగు లేన్ల ఎక్స్‌ప్రెస్‌వే, ఖమ్మం – దేవరపల్లి ప్యాకేజీ, తాడిపత్రి నాలుగు లేన్ల బైపాస్ రహదారులను ప్రారంభించనున్నారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల శిలాఫలకాల ఆవిష్కరణ అనంతరం బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసగించనున్నారు.







