రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
సంతకాల ఫోర్జరీ కేసు.. లోపలికి అనుమతి నిరాకరణ
కోల్‌కతా: ఎమ్మెల్యేల సంతకాల ఫోర్జరీ కేసు నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ (TMC)కు ఇబ్బందులు కొనసాగుతున్నాయి. ఈ కేసు దర్యాప్తు భాగంగా సీఐడీ బృందం మంగళవారం ఖాళీఘాట్‌లోని TMC కార్యాలయానికి వెళ్లినా, వారిని కార్యాలయం ఆవరణలోకి అనుమతించలేదని సమాచారం.
టీఎంసీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నివాసానికి ఆనుకుని ఉన్న ఈ కార్యాలయానికి సీఐడీ అధికారులు ముందుగా ఖాళీఘాట్ పోలీస్ స్టేషన్ సిబ్బందిని వెంట తీసుకుని చేరుకున్నారు. కార్యాలయం వద్ద కొంతసేపు వేచి చూసిన అనంతరం వారిని కలిసేందుకు TMC మాజీ ఎంపీ, పార్టీ కోశాధికారి సుభాశిష్ చక్రవర్తి బయటకు వచ్చారు.
మమతా బెనర్జీ, TMC ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీలో ఉన్నారని సుభాశిష్ చక్రవర్తి సీఐడీ బృందానికి తెలిపారు. వారు లేకుండా కార్యాలయంలోకి అనుమతించలేమని ఆయన స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.
దీనికి ప్రతిగా, విచారణలో భాగంగానే తాము వచ్చామని, సంబంధితులు అక్కడ ఉండాల్సిన అవసరం లేదని సీఐడీ అధికారులు చక్రవర్తికి తెలియజేశారు. అభిషేక్ బెనర్జీకి జారీ చేసిన నోటీసును చూపిస్తూ, సెర్చ్ ఆపరేషన్‌కు సహకరించాలని వారు కోరినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలుస్తోంది.
ఖాళీఘాట్ కార్యాలయంతో పాటు, కోల్‌కతాలోని కామాక్ స్ట్రీట్‌లో ఉన్న అభిషేక్ బెనర్జీ నివాసానికి కూడా మరో సీఐడీ బృందం వెళ్లినట్టు సమాచారం. నకిలీ సంతకాల కేసులో పోలీస్ దర్యాప్తుకు సహకరిస్తున్న సీఐడీ అధికారులు గత మే 30న తొలిసారి అభిషేక్ బెనర్జీ ఖాళీఘాట్ నివాసానికి వెళ్లి, జూన్ 1న విచారణకు హాజరుకావాలని కోరారు.
14 రోజులు గడువు కావాలి : అభిషేక్ బెనర్జీ
అయితే తనకు 14 రోజులు గడువు ఇవ్వాలని అభిషేక్ బెనర్జీ అభ్యర్థించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఆయన విజ్ఞప్తిని సీఐడీ తిరస్కరించింది. వారం రోజుల్లోగా తమ ముందుకు హాజరుకావాలని తాజా నోటీసు జారీ చేసింది. సోమవారంతో ఆ గడువు ముగిసినా, సీఐడీ విచారణకు అభిషేక్ బెనర్జీ హాజరుకాలేదని తెలుస్తోంది. పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా శోవన్‌దేబ్ ఛటోపాధ్యాయ, ప్రతిపక్ష ఉపనాయకులుగా అసిమా పాత్రా, నైనా బంద్యోపాధ్యాయ, చీఫ్ విప్‌గా ఫిర్హాద్ హకీంల నియామకానికి సంబంధించి అసెంబ్లీకి సమర్పించిన పత్రాలపై పలువురు TMC ఎమ్మెల్యేల సంతకాలను ఫోర్జరీ చేశారన్న ఆరోపణలపై ఈ కేసు దర్యాప్తు కొనసాగుతోంది.







