రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అవకతవకలు, ఎన్నికల ప్రక్రియలో ‘‘ఓట్ల చోరీ’’ జరుగుతోందన్న ఆరోపణలపై ప్రతిపక్ష కూటమి ఇండియా బ్లాక్ ఆందోళనకు సిద్ధమైంది. అక్టోబర్ 6న ప్రతిపక్ష ఎంపిలందరూ కలిసి ఎన్నికల సంఘం (ఇసి) కార్యాలయానికి ర్యాలీ నిర్వహించనున్నట్లు ఇండియా బ్లాక్ ప్రకటించింది. న్యూఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్‌లో బుధవారం ఈ కూటమి కీలక సమావేశం జరిగింది.
కాంగ్రెస్ అధ్యక్షుడు, రాజ్యసభలో ప్రతిపక్షనేత మల్లికార్జున్ ఖర్గే ఈ సమావేశంలో ప్రతిపక్షాల తదుపరి కార్యాచరణను వివరించారు. అక్టోబర్ 2 నుంచి అక్టోబర్ 8 వరకు దేశంలోని అన్ని జిల్లాల్లో ప్రతిపక్ష పార్టీలు ‘‘ప్రజాస్వామ్య పరిరక్షణ’’ పేరుతో ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)లో జరుగుతున్న అవకతవకలపై, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని ఒత్తిడి తీసుకురావడమే ఈ సమావేశ లక్ష్యమని ఇండియా బ్లాక్ వర్గాలు పేర్కొన్నాయి.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల స్థానంలో బ్యాలెట్ పేపర్లను తిరిగి ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌ను ఖర్గే ముందుకు తీసుకువచ్చారు. బ్యాలెట్ పేపర్ల వినియోగానికి ఇండియా బ్లాక్ నేతలంతా ఆమోదం తెలిపినట్లు ఆయన చెప్పారు. 2026 నవంబర్ 1న ఢిల్లీలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు కూడా ఖర్గే వెల్లడించారు. ప్రజల ఓటు హక్కు, ఇతర రాజ్యాంగపరమైన హక్కులను ప్రభుత్వం ఎలా హరిస్తోందో ప్రజలకు వివరించేందుకు ప్రతిపక్షాలు ఐదు భారీ ర్యాలీలను చేపట్టనున్నాయని ఆయన తెలిపారు.
ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిన వారికి శిక్ష తప్పదని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. తాము చర్చ జరిపామని, ప్రధాని మోడీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ ఎన్నికలను అపహరించారన్నది నేతలందరి ఉమ్మడి అభిప్రాయమని అన్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిన వారు ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నవారైనప్పటికీ, వారికి శిక్ష తప్పదని అన్నారు. రాజ్యాంగాన్ని సమిష్టిగా రక్షించాల్సిన బాధ్యత నేతలదేనని సూచించానని అన్నారు. రాజ్యాంగంపై మోడీ ప్రభుత్వం పదేపదే చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా, అధికారంలో కొనసాగేందుకు ఎన్నికల సంఘం సహకారంతో చేపడుతున్న ‘‘ఓట్ల చోరీ’’కి వ్యతిరేకంగా అన్ని పార్టీలు ఐక్యమయ్యాయని అన్నారు.
గత 10 నెలల్లో ఎన్నికల సంఘంలోని ఇద్దరు సభ్యులు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి ఎస్‌ఐఆర్, ఓటర్ల జాబితాకు సంబంధించిన వివిధ నిర్ణయాలపై కనీసం 14 అభ్యంతరాలు దాఖలు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ఈ నివేదికల నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు ఎన్నికల కమిషన్ అంతర్గత పనితీరుపై ప్రశ్నలు లేవనెత్తాయి. జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని, ఎస్‌ఐఆర్‌ను వెంటనే మూసివేయాలని సిపిఐ(ఎం), సిపిఐ, సిపిఐ(ఎంఎల్)-లిబరేషన్ పార్టీలు డిమాండ్ చేశాయి.
ఈ నేపథ్యంలో సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ అన్ని ప్రతిపక్ష పార్టీలకు లేఖ రాసి, ఇండియా బ్లాక్ సమావేశానికి పిలుపునిచ్చారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ లోక్‌సభ, రాజ్యసభల్లో ముసాయిదా నోటీసులు ఇవ్వడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ నోటీసుపై ఇండియా బ్లాక్ సమావేశంలో చర్చించి ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇండియా బ్లాక్ సమావేశానికి సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ హాజరయ్యారు. సమాజ్ వాదీ పార్టీ, సిపిఐ, ఎన్సీపీ, శివసేన (యూబీటీ), ఆర్జేడీ, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూ కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ, జార్ఖండ్ ముక్తి మోర్చా, సిపిఐ-ఎంఎల్, ఐయూఎంఎల్, కేరళ కాంగ్రెస్ (ఎం), ఎండీఎంకే, వీసీకే, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్ (జాకబ్), మమతా బెనర్జీ అనుబంధ పార్టీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తదితర పక్షాల ప్రతినిధులు పాల్గొన్నారు.
అయితే డీఎంకే, ఆమ్ ఆద్మీ పార్టీలు ఈ సమావేశానికి హాజరుకాలేదు. ఉత్తరప్రదేశ్‌లో రాజ్యసభ ఎన్నికల నామినేషన్ పనుల్లో బిజీగా ఉన్న కారణంగా సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా ఈ సమావేశానికి రాలేకపోయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.






