శత్రు బాలిస్టిక్‌ క్షిపణులకు చెక్‌

– బీఎండీ ఫేజ్‌–2 పరీక్ష విజయవంతం

అల్వాల్‌ : శత్రుదేశాలు ప్రయోగించే బాలిస్టిక్‌ ఖండాంతర క్షిపణులను 5 వేల కిలోమీటర్ల దూరంలోనే అడ్డుకొని ధ్వంసం చేసే సామర్థ్యమున్న ‘బాలిస్టిక్‌ మిస్సైల్‌ డిఫెన్స్‌ (బీఎండీ) ఫేజ్‌–2’ వ్యవస్థను డీఆర్‌డీవో విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షలతో భారత్‌ వైమానిక రక్షణ సామర్థ్యం మరింత బలపడిందని రక్షణ శాఖ ప్రకటించింది.

డీఆర్‌డీవో ఈ దశలో మొత్తం మూడు క్షిపణులను పరీక్షించింది. వీటిలో రెండు తదుపరి తరం ఇంటర్‌సెప్టర్‌ క్షిపణులు కాగా, మరొకటి నేవల్‌ యాంటీ షిప్‌ మిసైల్‌. ఒడిశా తీరంలోని ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ రేంజ్‌ నుంచి జూన్‌ 10, 11 తేదీల్లో ఈ ప్రయోగాలు నిర్వహించారు. శత్రు దేశాల నుంచి వచ్చే బాలిస్టిక్‌ క్షిపణులను అంతరిక్షంలోనే గానీ, వాతావరణ పరిధిలోనే గానీ ముందుగానే గుర్తించి వాటిని పూర్తిగా ధ్వంసం చేసే విధంగా ఈ బీఎండీ ఫేజ్‌–2 వ్యవస్థను రూపకల్పన చేశారు.

ఇలాంటి అత్యాధునిక బహుళస్థాయి వైమానిక రక్షణ వ్యవస్థ ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, ఇజ్రాయెల్‌ వంటి కొద్దిమంది దేశాల వద్ద మాత్రమే ఉంది. తాజా పరీక్షలతో ఆ జాబితాలో భారత్‌ కూడా స్థానం సంపాదించిందని రక్షణ శాఖ పేర్కొంది. దీతో దేశ వ్యూహాత్మక రక్షణ సామర్థ్యం గణనీయంగా పెరిగినట్టుగా భావిస్తున్నారు.

ఇక నేవల్‌ యాంటీ షిప్‌ మిసైల్‌ మీడియం రేంజ్‌ తొలి ఫ్లైట్‌ టెస్ట్‌ను కూడా డీఆర్‌డీవో విజయవంతంగా పూర్తి చేసింది. ఈ క్షిపణి మీడియం రేంజ్‌లో ఉన్న శత్రు యుద్ధనౌకలను అత్యంత కచ్చితత్వంతో లక్ష్యంగా చేసుకుని దాడి చేయగల సామర్థ్యాన్ని ఈ పరీక్షలో ప్రదర్శించింది. సముద్ర రక్షణ రంగంలో భారత నౌకాదళానికి ఇది కీలక బలంగా నిలుస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

శాస్త్రజ్ఞులను అభినందించిన రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌..

ఈ విజయాల నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ డీఆర్‌డీవో శాస్త్రజ్ఞులను అభినందించారు. వరుసగా మూడు కీలక పరీక్షలను నిర్వహించడం ద్వారా భారత్‌ దీర్ఘ శ్రేణి బాలిస్టిక్‌ క్షిపణుల నుంచి బహుళ అంచెల రక్షణ కలిగిన దేశంగా, అలాగే మీడియం రేంజ్‌లో శత్రు నౌకలను అడ్డుకునే సామర్థ్యమున్న దేశంగా తన స్థాయిని మరింత బలపరిచిందని ఆయన పేర్కొన్నారు.

లాంగ్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణుల నుంచి బహుళ అంచెల రక్షణను, అలాగే మీడియం రేంజ్‌లో శత్రు నౌకలను అడ్డుకునే సత్తా మనకుందని నిరూపించే 3 పరీక్షలను వరుసగా నిర్వహించాం