రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్:
వెనెజువెలా కోసం భారత్ ‘ఆపరేషన్ అమిస్టాడ్’
భూకంపాలతో తీవ్రంగా దెబ్బతిన్న వెనెజువెలాకు సహాయం అందించేందుకు భారత్ ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. లాటిన్ అమెరికా దేశమైన వెనెజువెలాలో ఇటీవల సంభవించిన వరుస భూకంపాల వల్ల భారీ ప్రాణ, ఆస్తి నష్టం చోటుచేసుకోవడంతో ప్రపంచ దేశాలు సహాయక హస్తం చాపుతున్నాయి. ఈ క్రమంలో భారత్ కూడా అత్యవసర సహాయ సామగ్రిని పంపిస్తూ ‘ఆపరేషన్ అమిస్టాడ్’ పేరుతో ప్రత్యేక ఆపరేషన్‌ను ప్రారంభించింది.
ఈ విషయాన్ని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ వెల్లడించారు. వెనెజువెలాకు అవసరమైన అత్యవసర సహాయక సామగ్రితో భారత వాయుసేనకు చెందిన రెండు C17 విమానాలు ఇప్పటికే బయలుదేరినట్లు ఆయన తెలిపారు. ఈ విమానాల ద్వారా 35 టన్నులకు పైగా సహాయక సామగ్రిని పంపుతున్నట్టు వివరించారు.
భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్, అత్యవసర పరిస్థితుల్లో గాయపడిన వారికి తక్షణ వైద్య సేవలు అందించే సామర్థ్యమున్న రెండు మొబైల్ ఆసుపత్రి టెంట్లు BHISHM Cubesను కూడా ఈ ఆపరేషన్‌లో భాగంగా పంపించారు. వీటితో పాటు అత్యవసర ఔషధాలు, వైద్య పరికరాలు, ఇతర అవసరమైన సామగ్రి కూడా వెనెజువెలాకు తరలిస్తున్నారు.
వెనెజువెలాలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాల ధాటికి అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీయడానికి భారీ నిర్మాణ పరికరాలు, ప్రత్యేక రక్షణ బృందాలు అవసరమని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారత్ సహా పలు దేశాలు తమ తమ సహాయక బృందాలను పంపేందుకు ముందుకొస్తున్నాయి.
అమెరికా, చిలీ, స్విట్జర్లాండ్, తుర్కియే నుంచి సహాయక బృందాలు ఇప్పటికే వెనెజువెలా చేరుకుని రక్షణ చర్యల్లో పాల్గొంటున్నాయని స్థానిక మీడియా తెలిపింది. ఖతార్, బ్రెజిల్, స్పెయిన్, పోర్చుగల్, కెనడా దేశాధినేతలు కూడా తమ బృందాలను పంపేందుకు సిద్ధమని ప్రకటించారు.
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ అక్కడి వ్యాపార సంస్థలకు విజ్ఞప్తి చేస్తూ, శిథిలాలను తొలగించేందుకు అవసరమైన భారీ యంత్రాలు, పరికరాలను అందుబాటులో ఉంచాలని కోరినట్లు సమాచారం. భూకంపాల అనంతరం వేలాది మంది గల్లంతయ్యారని, మరణాల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
స్పానిష్ భాషలో ‘అమిస్టాడ్’ అంటే స్నేహం అనే అర్థం. వెనెజువెలా సంక్షోభ సమయంలో భారత్ చేపట్టిన ఈ ‘ఆపరేషన్ అమిస్టాడ్’ రెండు దేశాల మధ్య ఉన్న స్నేహ సంబంధాలను ప్రతిబింబిస్తున్నదిగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







