వెనెజువెలా ప్రకృతి విలయంపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ క్లిష్ట సమయంలో ఆ దేశానికి అండగా ఉంటామని ఎక్స్ వేదికగా వెల్లడించారు.

తక్షణసాయం చేస్తాం: ట్రంప్‌

వెనెజువెలా ప్రజలకు సహాయం చేయడానికి అమెరికా సిద్ధంగా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్‌లో పోస్టు పెట్టారు. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టేలా సంసిద్ధంగా ఉండాలని అన్ని ఏజెన్సీలను ఆదేశించినట్లు చెప్పారు. ఈ సందర్భంగా వెనెజువెలా ప్రజలను గొప్ప స్నేహితులుగా అభివర్ణించారు. ఇప్పటికే సహాయక బృందాలను మోహరించామని అమెరికా విదేశాంగమంత్రి మార్కో రూబియో వెల్లడించారు.

కాగా.. వెనెజువెలాలో సంభవించిన వరుస భూకంపాలతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు 32 మంది ప్రాణాలు కోల్పోగా.. 700 మంది వరకు గాయపడ్డారని తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్‌ వెల్లడించారు. రాజధాని నగరం కరాకస్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భూకంప తీవ్రత ధాటికి భవనాలు కూలిపోవడంతో.. శిథిలాల కింద అనేక మంది చిక్కుకున్నారు. దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు.