రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామినేషన్ మరో రెండు వారాల్లో జరగనుంది. ఇటీవల నీట్ ప్రశ్నపత్రం లీక్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేసి, తిరిగి నిర్వహించేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈసారి ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు జాతీయ పరీక్షల సంస్థ ఎన్‌టీఏ అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. ప్రశ్నపత్రాల తయారీ దశ నుంచే కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రాల రూపకల్పనలో పాల్గొన్న నిపుణులను రహస్య ప్రదేశంలో లాక్‌డౌన్‌లో ఉంచినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం తయారీలో భాగమైన నిపుణులు, పర్యవేక్షకులు, ట్రాన్స్‌లేటర్లు సహా ఈ ప్రక్రియలో పాల్గొన్న ప్రతి ఒక్కరినీ అత్యంత భద్రత కలిగిన రహస్య ప్రాంగణంలో ఉంచారు. వీరిపై భద్రతా అధికారులు నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.
ఈ నిపుణులకు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచీలు, ఇతర కమ్యూనికేషన్ పరికరాలేవీ అందుబాటులో లేవని వర్గాలు చెబుతున్నాయి. అనుమతి పొందిన సిబ్బందికే ఆ ప్రాంగణంలోకి ప్రవేశం కల్పిస్తున్నట్లు పేర్కొంటున్నాయి. జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ పూర్తయ్యే వరకు ఈ నిపుణులు ఇదే లాక్‌డౌన్ పరిస్థితుల్లో ఉండనున్నారని సమాచారం.
నీట్ పేపర్ లీక్ ఘటనతో ఎన్‌టీఏపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రీ-ఎగ్జామినేషన్ నిర్వహణలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా మల్టీ లేయర్ సెక్యూరిటీ ఫ్రేమ్‌వర్క్ రూపొందించినట్లు అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, ప్యాకేజింగ్, నిల్వ, రవాణా, పంపిణీ వరకు ప్రతి దశలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను అమలు చేస్తున్నారు.
పేపర్ రవాణా కోసం వాయుసేన విమానాలను వినియోగించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఇదిలాఉండగా, రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రం కూడా లీక్ అయిందని ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. దీనిని ఎన్‌టీఏ ఖండించింది. ఆ వార్తలు అవాస్తవం, మోసపూరితమని స్పష్టం చేసింది. అభ్యర్థులు, వారి తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, మోసగాళ్ల మాటలు నమ్మకూడదని హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా మే 3న నిర్వహించిన నీట్ పరీక్షలో ప్రశ్నపత్రం లీకేజీ ఆరోపణలు తీవ్ర దుమారం రేపాయి. దాంతో మే 12న ఆ పరీక్షను రద్దు చేసి తిరిగి నిర్వహిస్తామని ఎన్‌టీఏ ప్రకటించింది. జూన్ 21న దేశవ్యాప్తంగా 551 నగరాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 వరకు నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ జరగనుంది.







