ఈ పవిత్ర యాత్రను ఒక 'గొప్ప భాగ్యం'

జమ్మూ‌- కశ్మీర్‌లో శుక్రవారం నుంచి ప్రారంభమైన వార్షిక అమర్‌నాథ్ యాత్రను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ భక్తులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర యాత్రను ఒక 'గొప్ప భాగ్యం'గా అభివర్ణించిన ప్రధాని, భక్తులు భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో, బాధ్యతాయుతమైన జాతీయ భావనతో ఈ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరారు. శివభక్తులను ఉద్దేశించి రాసిన లేఖను ఎక్స్ (X) వేదికగా పంచుకుంటూ పీఎం మోదీ పలు కీలక విషయాలను ప్రస్తావించారు.

'పవిత్రమైన అమర్‌నాథ్ యాత్రలో పాల్గొనడం ఒక గొప్ప భాగ్యం. ప్రతి సంవత్సరం 'బాబా బర్ఫానీ' (మంచు లింగం)ని నేరుగా దర్శించుకునే ఈ అవకాశం లక్షలాది మంది శివభక్తులకు అత్యంత పవిత్రమైన, మరపురాని అనుభూతిని ఇస్తుంది. ఈ సంవత్సరం యాత్రకు సిద్ధమవుతున్న భక్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.' అని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు.

కాగా.. పవిత్ర అమర్‌నాథ్ యాత్ర ఘనంగా ప్రారంభమైంది. వర్షం కురుస్తున్నప్పటికీ వేలాది మంది శివభక్తులు, పహల్గామ్ బేస్ క్యాంపుల నుంచి బాబా బర్ఫానీ దర్శనం కోసం ప్రయాణం మొదలుపెట్టారు. తొలి రోజే 10 వేల మందికి పైగా యాత్రికులు యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ అమర్‌నాథ్ యాత్రికులకు ప్రత్యేక లేఖ రాస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ప్రతి భక్తుడు ఐదు సంకల్పాలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

యాత్ర ఆగస్టు 28 వరకు

అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది ఆగస్టు 28 వరకు కొనసాగనుంది. బల్తాల్ మార్గంలో వెళ్లే భక్తులు అదే రోజు సాయంత్రానికి బాబా బర్ఫానీ దర్శనం చేసుకునే అవకాశం ఉండగా, పహల్గామ్ మార్గంలో వెళ్లే యాత్రికులు మరుసటి రోజు దర్శనం పొందనున్నారు.