సీజేపీ ఆందోళనలు.. హింసలో పాల్గొంటే పాస్‌పోర్ట్‌లు రద్దు?

సీజేపీ నిరసనల సందర్భంగా చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. హింసలో పాల్గొన్న వారి పాస్‌పోర్ట్‌లను రద్దు చేసే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి. నిరసనల సమయంలో జరిగిన ఘటనలకు సంబంధించిన ఆధారాలను పోలీసులు సేకరిస్తున్నారు. సీసీటీవీ దృశ్యాలు, వీడియోలు, ఫొటోలు, ఇతర డిజిటల్ ఆధారాల ఆధారంగా హింసలో పాల్గొన్న వారిని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు సమాచారం.

జులై 24న దేశవ్యాప్త నిరసనలు.. కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు

నీట్‌ పేపర్ లీక్‌కు కేంద్రం బాధ్యత వహించాలంటూ ఉద్యమిస్తున్న కాక్రోచ్ జనతా పార్టీ జులై 24న దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. పార్లమెంటు మార్చి సందర్భంగా యువతపై పోలీసుల కర్కశత్వాన్ని వ్యతిరేకిస్తూ ఈ నిరసనకు పిలుపునిచ్చినట్టు తెలిపింది. ఈ కార్యక్రమానికి కావాల్సిన అనుమతలు, ఇతర ఏర్పాట్లకు సిద్ధం కావాలని యువతను కోరింది. పేపర్ లీక్‌ అంశంపై చర్చకు తాము సిద్ధమని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ మరో నిరసన కార్యక్రమానికి సిద్ధం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈ నిరసన కార్యక్రమానికి కావాల్సిన అనుమతులు పొందేందుకు, ఏర్పాట్లు చేసేందుకు విద్యార్థి సంస్థలు, యూత్ ఆర్గనైజేషన్లు కలిసి పనిచేయాలని సీజేపీ పిలుపునిచ్చింది. నీట్ పేపర్ లీక్ అంశంలో సీజీపే డిమాండ్స్‌ గురించి ఈ నిరసనల్లో బహిరంగంగా చదవాలని పేర్కొంది. బాధితులకు సంఘీభావంగా ఇంక్విలాబ్ జిందాబాద్, భారత్ మాతాకీ జై వంటి నినాదాలు చేయాలని కూడా సూచింది. ఇలాంటి ఇతర సానుకూల నినాదాలను మాత్రమే ఎంచుకోవాలని పేర్కొంది. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దని పేర్కొంది. నిరసనకు అనుమతి ఉన్న ప్రాంతాలకే పరిమితం కావాలని, ట్రాఫిక్‌కు ఆటంకాలు లేకుండా చూసుకోవాలని సూచించింది. రెచ్చగొట్టే చర్యలకు స్పందించవద్దని కూడా పేర్కొంది.

శాంతియుత మార్గంలోనే నిరసన కార్యక్రమం చేపట్టాలని కూడా స్పష్టం చేసింది. ఇక నీట్‌ ఉదంతంపై విచారణ కోసం కేంద్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే.