తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభోత్సవం

హాజరైన ముగ్గురు సీఎంలు

కర్ణాటకలోని హోస్పేటలో తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌, కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌,  తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని నూతన గేట్లను ప్రారంభించారు. 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనతో రూ.51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

వివాదాలను పరిష్కరించుకుందాం: సీఎం రేవంత్‌రెడ్డి

తుంగభద్ర నది ఒడ్డున.. బళ్లారి వేదికగా జరిగిన ఈ సమావేశం అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదానికి శాశ్వత పరిష్కారం చూపిస్తుందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆకాంక్షించారు. తుంగభద్ర ప్రాజెక్టుకు ఏర్పాటు చేసిన 33 నూతన గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం మాట్లాడారు.

‘‘తుంగభద్ర గేట్ల పునరుద్ధరణ ముహూర్తం చరిత్రలో నిలిచిపోతుంది. 3 తరాల సమస్యలను 33 గేట్ల పునరుద్ధరణ పరిష్కరించబోతోంది. బళ్లారి, కర్నూలు, అనంతపురం, పాలమూరు సమస్యలు తీరుస్తుంది. తక్కువ మాట్లాడటం. అత్యంత వేగంగా పనిచేయడం సీఆర్‌ పాటిల్‌ ప్రత్యేకత. అలాంటి వ్యక్తి.. కేంద్ర జల్‌శక్తిశాఖ మంత్రిగా ఉండటంతో  ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం దొరుకుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తున్నా. నీటి సమస్యలు పరిష్కరించకపోవడంతో నీరంతా సముద్రంలో కలుస్తున్నాయి. రాజోలిబండ డైవర్షన్‌ స్కీమ్‌లో పాలమూరుకు కేటాయించిన 15 టీఎంసీలలో కేవలం 5 టీఎంసీలు మాత్రమే వాడుకోగలుగుతున్నారు’’ అని సీఎం వివరించారు.