ఆంధ్రప్రదేశ్‌ను సెమీకండక్టర్ పరిశ్రమ పెట్టుబడుల కోసం ప్రపంచ స్థాయిలో అగ్రగమ్యస్థానంగా తీర్చిదిద్దుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సింగపూర్ పర్యటనలో భాగంగా అక్కడి ప్రముఖ పారిశ్రామిక వేత్తలతో, సెమీకండక్టర్ రంగ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు.

సింగపూర్‌లో నిర్వహించిన సెమీకాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సమావేశానికి సింగపూర్‌లోని పలు ప్రముఖ సెమీకండక్టర్ తయారీ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. గ్లోబల్ ఫౌండ్రీస్ , NXP, ASMPT, వన్ సిస్టం టెక్నాలజీస్ , టెక్సన్డ్ ఫోటోమాస్క్ , ఆక్వాటెక్ తదితర సంస్థల ప్రతినిధులు ఈ రౌండ్ టేబుల్‌లో పాల్గొని ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలపై చర్చించారు.

సెమీకండక్టర్ల తయారీకి ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో అమల్లో ఉన్న పారిశ్రామిక విధానాలు, అనుకూల వాతావరణం, మౌలిక వసతులు సెమీకండక్టర్ రంగానికి పెద్దగా తోడ్పడతాయని వివరించారు. పెట్టుబడులకు ఇది సరైన సమయమని, ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులకు భారత్ అత్యంత సురక్షిత ప్రాంతమైందని, అందులో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడిదారులకు అనుకూలమైన రాష్ట్రమని ఆయన పేర్కొన్నారు.

సింగపూర్ పారిశ్రామిక వేత్తలు, సెమీకండక్టర్ కంపెనీల ప్రతినిధులు వచ్చే 30 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి అక్కడి పారిశ్రామిక విధానాలు, అవకాశాలను ప్రత్యక్షంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వేగవంతమైన పరిపాలన, పారదర్శక విధానాలు పెట్టుబడిదారులకు నమ్మకాన్ని కలిగిస్తున్నాయని ఆయన వివరించారు.

రాయలసీమలో సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమ స్థాపనకు రంగం సిద్ధమవుతోందని చంద్రబాబు నాయుడు తెలిపారు. త్వరలోనే రాయలసీమ ప్రాంతంలో ఒక సెమీకండక్టర్ తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుందని చెప్పారు. డిఫెన్సు, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, ఫైటర్ జెట్‌ల తయారీతో పాటు ఆటోమొబైల్ రంగానికి రాయలసీమను ముఖ్య కేంద్రంగా అభివృద్ధి చేసే అవకాశాలు ఉన్నాయని ఆయన వివరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానాన్ని అమలు చేస్తున్నామని, పెట్టుబడిదారులు త్వరితగతిన అనుమతులు పొందేలా వ్యవస్థను రూపుదిద్దుతున్నామని ముఖ్యమంత్రి సమావేశంలో పేర్కొన్నారు. సెమీకండక్టర్ రంగానికి అవసరమైన నైపుణ్యాలు, మౌలిక వసతుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.