రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
అనకాపల్లి జిల్లా బోయపాడు తీర ప్రాంతంలో చేపలు మృతి చెందినట్టు వచ్చిన సమాచారంపై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ చేపట్టి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఏపీ కాలుష్య నియంత్రణ మండలి సభ్య కార్యదర్శిని ఆదేశించారు. చేపల మృతికి గల కచ్చితమైన కారణాలను అన్వేషించేందుకు శాస్త్రీయ పరిశోధనలు చేపట్టాలని కాలుష్య నియంత్రణ మండలి, మత్స్యశాఖ అధికారులు, మెరైన్ సైంటిస్టులకు సూచించారు. దీనిపై నిపుణులతో క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు. చేపలు మృతి చెందిన ప్రాంతంలో నీటి నమూనాలు, మృతి చెందిన చేపల శాంపిల్స్ సేకరించి ఇప్పటికే పరీక్షల నిమిత్తం పంపారు. సంబంధిత శాఖలన్నీ సమన్వయంతో విచారణ పూర్తి చేయాలని ఉప ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. సముద్ర జీవ వైవిధ్యం, పర్యావరణ సమతుల్య పరిరక్షణ, మత్స్యకారుల జీవనోపాధి సంరక్షణ.. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత అంశాలుగా ముందుకు తీసుకువెళ్తుందని తెలిపారు. బోయపాడు తీరంలో పరిస్థితిని ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుందని, శాస్త్రీయ నివేదికలు అందిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.







