రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
డబుల్ ఇంజిన్ సర్కార్ విజయాలు ప్రజల్లోకి..
కూటమి నేతలతో సీఎం చంద్రబాబు జూమ్ మీటింగ్
అమరావతి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు, కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి 12 ఏళ్లు పూర్తికావస్తున్న నేపథ్యంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పాలన విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని కూటమి పక్షాల నేతలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ఆదివారం రాజధాని అమరావతిలో కూటమి పక్షాల నేతలతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన, కేంద్రంలో మోదీ సర్కార్ 12 ఏళ్ల పాలన నేపథ్యంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ఆయన చర్చించారు.
జూన్ 9న తిరుపతి లో బహిరంగసభ..
జూన్ 9వ తేదీన తిరుపతి వేదికగా జరగనున్న భారీ బహిరంగ సభ ఏర్పాట్లపై ఈ సమావేశంలో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ సభకు కూటమిలోని ఆయా పార్టీల కార్యకర్తలందరినీ విస్తృతంగా సమీకరించాలని, వారిని సభకు ఆహ్వానించే కార్యక్రమాన్ని శ్రద్ధగా చేపట్టాలని నేతలకు సూచించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు సోదాహరణగా వివరించేలా కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు నేతలకు స్పష్టం చేశారు. మూడు ప్రాంతాల్లో నిర్వహించనున్న బహిరంగ సభలను విజయవంతం చేయడానికి కూటమి పక్షాలన్నీ సమన్వయంతో పనిచేయాలని ఆయన కోరారు.
ఈ జూమ్ మీటింగ్కు టీడీపీ తరఫున పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన తరఫున మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్సీ పి. హరిప్రసాద్, బీజేపీ తరఫున పీవీఎన్ మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ హాజరయ్యారు. ఇదివరకు జూన్ 4వ తేదీన ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి పార్టీల అగ్రనేతలు సమావేశమయ్యారు. ఆ సమావేశంలో ఏపీలో రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనతో పాటు కేంద్రంలో మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డబుల్ ఇంజిన్ సర్కార్ విజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాల్సిన అవసరంపై నేతలు చర్చించారు.
అలాగే కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు చేస్తున్న విమర్శల జోరుకు అడ్డుకట్ట వేయాలని, ఇందుకోసం ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ పనితీరును వివరించాలని ఆ సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. దీని ప్రకారం జూన్ 9వ తేదీన తిరుపతిలో, జూన్ 12వ తేదీన రాజధాని అమరావతిలో, జూన్ 15వ తేదీన విశాఖపట్నం వేదికగా డబుల్ ఇంజిన్ సర్కార్ విజయాలను ప్రజలకు వివరించే బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఈ సభలను విజయవంతం చేయాలని, ప్రతి పార్టీ తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఈ జూమ్ మీటింగ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయా పార్టీల అగ్రనేతలను ఆదేశించారు.







