రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
ఇప్పుడెందుకు ఈ వివాదాలు?
తెలుగు రాష్ట్రాలు విడిపోయి 12 ఏళ్లయింది.. : సీఎం చంద్రబాబు
అమరావతి : రాజకీయ ప్రయోజనాల కోసం తెలుగు ప్రజల మధ్య మళ్లీ విభేదాలు రేకెత్తించే ప్రయత్నాలు చేయడం సరైంది కాదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రాలు వేరు అయినా తెలుగువారంతా ఒక్కటేనని, ప్రాంతీయ విద్వేషాలు సృష్టించే ప్రయత్నాలను ఖండించారు.
డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై బుధవారం సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా, ఎక్కడైనా రాజకీయాలు చేసే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో గతంలో ఇతర రాష్ట్రాల్లోనూ నేతలు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఉదాహరణలను ప్రస్తావించారు.
తెలంగాణలో కొందరు నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమేనని, అలాంటి వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అనవసర ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. రెండు రాష్ట్రాలుగా ఏర్పడి 12 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్లీ ఇలాంటి వివాదాలు సృష్టించడం ఎవరికీ మేలు చేయదని స్పష్టం చేశారు.
తెలుగువారి మధ్య గౌరవం ఉండాలి..
తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత రెండు ప్రాంతాల మధ్య సహకారం, పరస్పర గౌరవం మరింత పెరగాలని సీఎం అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, ప్రజల సంక్షేమం ప్రధాన లక్ష్యాలుగా ఉండాల్సిన సమయంలో విభేదాలు రేకెత్తించే వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగువారి ఐక్యతను దెబ్బతీసే ప్రయత్నాలు రాజకీయంగా కూడా, సామాజికంగా కూడా ప్రతికూల ఫలితాలకే దారితీస్తాయని చంద్రబాబు నాయుడు సూచించారు. రెండు రాష్ట్రాల ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన పునరుద్ఘాటించారు.
ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చు...
గతంలో నేను తమిళనాడు వెళ్లి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాను. కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ కూడా ఇతర రాష్ట్రాల్లో ప్రచారానికి వెళ్లారు. బీఆర్ఎస్ పార్టీ తాము జాతీయ పార్టీ అని ప్రకటించుకుంది కదా.. ఇప్పుడెందుకు అనవసరంగా మాట్లాడుతున్నారు. అమెరికాలో కూడా తెలుగువారు సెనేటర్లు అవుతున్నారు. ప్రజాసేవ చేసినవారినే ప్రజలు ఆదరిస్తారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు తెలంగాణలో మాట్లాడుతున్న మాటలు ఎంతమాత్రం కరెక్ట్ కాదు. రెండు రాష్ట్రాలుగా విడిపోయి 12 ఏళ్లు అవుతోంది. ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడెందుకు మళ్లీ ఇవన్నీ సృష్టిస్తున్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఎవరికీ మంచిది కాదు. తెలంగాణ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ.. తెలుగువారిగా అంతా కలిసికట్టుగా ఉండాలి. రెండు రాష్ట్రాలనూ ప్రగతి పథంలో నడిపించుకోవడమే అందరి లక్ష్యం కావాల ని సీఎం బాబు ఆకాంక్షించారు.







