రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
ప్రభుత్వంపై దుష్ప్రచారం..
అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో కుట్రలు పన్నే పార్టీలు ఉన్నాయని.. ప్రతి అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. వివిధ ఘటనలకు కులమతాల రంగు పులుముతున్నారని.. వాటిని వివాదాస్పద అంశాలుగా మారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఫేక్ ప్రచారం చేస్తూ ఉద్యోగులు, అధికారులను బద్నాం చేస్తున్నారన్నారు. ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. ఇలాంటి విషయాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. మానవీయ కోణంలో పీజీఆర్ఎస్ అర్జీలను పరిష్కారించాలని అధికారులను ఆదేశించారు.
ఇటీవల కాలంలో మానసిక సమస్యల కారణంగా కూడా కొంతమంది నేరాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు అన్నారు. డ్రగ్స్, గంజాయిలకు అలవాటు పడి తప్పు దారి పడుతున్నారని వ్యాఖ్యానించారు. 2019లో జరిగిన కొన్ని నేరాలను ఇప్పుడు ట్రేస్ చేసి పట్టుకుంటున్నారని, శిక్షలు కూడా పడుతున్నాయని చెప్పారు. ఇలాంటివి ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరముందన్నారు. తప్పుచేసిన వాడు ఎప్పుడూ తప్పించుకోలేడని హెచ్చరించారు. డిసెంబర్ నెలలో క్వాంటం కంప్యూటర్ లాంచ్ చేసేలోపు క్వాంటం పార్కు, సెమీ కండక్టర్ల పార్కు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమస్య పరిష్కారం కోసం అధికారులు, ఉద్యోగుల వద్దకు వచ్చే పౌరులతో సౌమ్యంగా వ్యవహరించాలన్నారు.
అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలి..
పీజీఆర్ఎస్ అర్జీలను మానవీయ కోణంలో పరిష్కరించాలని అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు సూచించారు. అర్జీదారుల స్థానంలో ఉండి ఫిర్యాదులను పరిష్కరించే దిశగా దృష్టి సారించాలని ఆదేశించారు. ఉద్యోగులు, అధికారులు సాఫ్ట్ స్కిల్స్ అలవరచుకోవాలన్నారు. వినూత్న ఆలోచనలతో పని చేసే విధంగా ప్రోత్సహిస్తామన్నారు. పనితీరు ఆధారంగానే బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. ప్రజలతో వ్యవహరించే సమయంలో సౌమ్యంగా, మర్యాదపూర్వకంగా ఉండాలని సూచించారు. దీనివల్ల పాలనపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని తెలిపారు. మానవ వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఉద్యోగులు తమ సామర్థ్యాలను ఎప్పటికప్పుడు పెంచుకోవాలని చెప్పారు.







