రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
‘మనమిత్ర’ వాట్సప్‌లోనూ ఫిర్యాదులు స్వీకరణ
ప్రభుత్వ సేవలు ప్రజలకు సులభంగా అందించేలా చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ సెంటర్ నుంచి వివిధ శాఖల పనితీరుపై సీఎం సమీక్షించారు. ఈ మేరకు ప్రభుత్వ సేవలను ప్రజలకు అందించే అంశంపై అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ప్రజలతో నిత్యం సంబంధాలున్న శాఖలు, విభాగాల్లో ప్రభుత్వ సేవలు పొందడం సులభతరం చేయాలన్నారు. ఈ మేరకు సేవల సులభతర ప్రక్రియ మొదలు పెట్టామని.. తొలుత 11 రకాల సేవల్లో అంశాలను కుదిస్తున్నామని అధికారులు సీఎంకు వివరించారు.
ప్రజా ఫిర్యాదుల వ్యవస్థను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఈ సందర్భంగా చంద్రబాబు పలు సూచనలు చేశారు. ఆన్‌లైన్‌లో ఫిర్యాదులు చేసే అవకాశాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్నారు. ‘మనమిత్ర’ వాట్సప్‌లోనూ ఫిర్యాదులు చేసే అవకాశం కల్పించాలని సూచించారు. వాయిస్ మెసేజ్‌లు పెట్టినా ఫిర్యాదులుగా స్వీకరించేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో మొబైల్ నెట్‌వర్క్ సమస్యలు లేకుండా చూడాలన్నారు. సుమారు 3వేల ప్రాంతాల్లో కనెక్టివిటీ సమస్య ఉందని.. మూడు నెలల్లో సమస్య పరిష్కరించాలన్నారు. ఈ మేరకు నెట్‌వర్క్ సంస్థలతో మాట్లాడాలని సూచించారు.







