రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
దేశంలోని పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే!
దాల్మియా రెండోప్లాంట్ విస్తరణకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
రాష్ట్రంలో అనుమతులు త్వరగా ఇవ్వడం వల్లే భారీగా పెట్టుబడులు వస్తున్నాయని ఏపీ మంత్రి నారా లోకేశ్ అన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోటీపడి పరిశ్రమలను తీసుకొస్తున్నామని చెప్పారు. వైఎస్‌ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్నకొమెర్లలో దాల్మియా సిమెంట్ పరిశ్రమ రెండోప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. దాల్మియా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో పునీత్ దాల్మియాతో కలిసి లోకేశ్ భూమిపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శిలాఫలకాన్ని ఆవిష్కరించారు.
అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. భారత్‌కు వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వస్తున్నాయని అన్నారు. సిమెంట్ ఉత్పత్తి రంగంలో దాల్మియా గ్రూప్ బలమైందన్నారు. దీంతో ఎంతో మందికి ఉపాధి లభిస్తోందని చెప్పారు. వైకాపా హయాంలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ చాలా దెబ్బతిందన్నారు. మళ్లీ అభివృద్ధి స్థాయికి రాష్ట్రాన్ని తీసుకురావడానికి రెండేళ్లు అహర్నిశలు కష్టపడ్డామని చెప్పారు. రూ.3,100 కోట్లతో చేపడుతున్న ఈ పరిశ్రమ విస్తరణ పనులతో మరో 700 మందికి ఉపాధి లభించనుంది.
జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ..
వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై మంత్రి నారా లోకేశ్ మరోసారి విరుచుకుపడ్డారు. జగన్ కడపకు పట్టిన క్యాన్సర్ గడ్డ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత బాబాయి వివేకానంద రెడ్డిని చంపింది జగనే అని ఆరోజు పాదయాత్రలో చెప్పానని... ఈరోజు కూడా చెబుతున్నానన్నారు. జగన్ పార్టీ.. హిట్ అండ్ రన్ పార్టీ అంటూ దుయ్యబట్టారు. ‘మాజీమంత్రి కొడుకు రోడ్డు ప్రమాదం చేసి ఒకరిని చంపితే తప్పుకాదా? కొడుకు తప్పు చేస్తే ఒక కేంద్రమంత్రి వెంటనే సరెండర్ చేశారు. మీ మాజీమంత్రి తప్పు చేస్తే.. మీరేం చేశారు? గతంలో జగన్ కారు టైర్ల కింద నలిగి ఒకరు చనిపోయారు. ఇవన్నీ వీళ్లకు చిన్న విషయాలులానే ఉంటాయి’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.







