బీమా బకాయిల విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌

మంత్రి అచ్చెన్నాయుడు

రాష్ట్రంలో బీమా బకాయిలు విడుదలకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పెండింగ్‌లో ఉన్న సుమారు 1,900 కోట్ల పంటల బీమా ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వం విడతలవారీగా చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. దీంతో ఖరీఫ్-2024 పంటల బీమా బకాయిలను విడుదల చేసేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వెల్లడించారు. ఇటీవల కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌ను కలిసి రాష్ట్ర రైతుల సమస్యలను వివరించి, పెండింగ్ బీమా నిధుల విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో కేంద్రం సానుకూలంగా స్పందించిందన్నారు. కేంద్రం నుంచి ఖరీఫ్-2024 పంటల బీమా నిధులు విడుదలైన వెంటనే అర్హత కలిగిన రైతుల ఖాతాల్లో నేరుగా జమ కానున్నాయన్నారు. రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.