రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
జగన్ నైజం..‘హిట్..రన్ అండ్ ఎస్కేప్’: సీఎం చంద్రబాబు
సమస్యలు సృష్టించి.. బెంగళూరులో దాక్కుంటారు..
‘హిట్, రన్ అండ్ ఎస్కేప్ అనేది గొడ్డలి పార్టీ అధినేత జగన్ నైజం’ అని సీఎం చంద్రబాబు విమర్శించారు. నేరపూరిత మనస్తత్వం ఉండేవారు సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారని, ప్రభుత్వాన్ని, నేతలను లక్ష్యంగా చేసుకొని విషప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. ఇక్కడ సంఘటనలు చేయించి.. జగన్ బెంగళూరు వెళ్లి దాక్కుంటున్నారని ఎద్దేవా చేశారు.
‘‘ ఏదో ఒక అరాచకానికి.. తెదేపా నేతలను బాధ్యుల్ని చేయాలని చూస్తున్నారు. ఈ సైకోయిజానికి.. ఆధ్యాత్మికత, టెక్నాలజీ పరిష్కారం చూపిస్తాయి. ఇలాంటి సైకో మనస్తత్వమే ఇవాళ తెలంగాణలో ఆరుగురి హత్యకు దారితీసింది. పోక్సో కేసు పెట్టారని.. కేసు పెట్టిన వారిని చంపేశాడు. తనకు సహకరించలేదని సొంత కుటుంబ సభ్యుల్నీ చంపేశాడు. గొడ్డలి పార్టీ అధినేతకూ, ఈ హంతకుడి మనస్తత్వానికి దగ్గర పోలికలు ఉన్నాయి. ఇద్దరి మనస్తత్వాలు ఇంచుమించు ఒక్కటే. కన్న తల్లి, సొంత చెల్లి, బాబాయ్ వ్యవహారాలు చూశాం. జగన్ నమ్ముకుంది గొడ్డలి, సోషల్ మీడియా ద్వారా విష ప్రచారమే. ప్రజలకు సాంకేతికతతో పాటు ఆధ్యాత్మికత ఎంతో అవసరం. అప్పుడే ఏది నిజమో తెలుసుకొని.. మంచి, చెడులు బేరీజు వేసుకోగలరు. గొడ్డలి పార్టీ అధినేత కుటుంబ చరిత్ర మొత్తం నేర స్వభావమే. తాత ముత్తాతల నుంచి ఇదే వైఖరి కొనసాగుతోంది. ఆ పార్టీ నేతల చరిత్ర కూడా అలాగే తయారవుతోంది.
జగన్ ఎన్ని కుట్రలు పన్నినా భోగాపురం విమానాశ్రయం పూర్తయిపోయింది. అమరావతి, పోలవరం, వెలిగొండ పూర్తవుతున్నాయి. జగన్ .. రాష్ట్రానికి పరిశ్రమలు రాకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. మావిగన్ పేరుతో పారిశ్రామిక వేత్తలను గందరగోళానికి గురి చేయాలనుకుంటున్నారు. బ్రాహ్మణి స్టీల్స్ దోపిడీ కథ ఇంతటితో ఆగలేదు. బ్రాహ్మణి స్థలం సమస్యకే ప్రస్తుతానికి ఇన్నేళ్లకు చెక్ పడింది. ఆ పరిశ్రమ వల్ల ఓబుళాపురం మైనింగ్ బ్లాక్ అయ్యింది. అలా జరగకుండా ఉంటే.. రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వచ్చేవి. 4 సిమెంట్ ఫ్యాక్టరీలు, పరిశ్రమలు వచ్చేవి. పెండింగ్‌లో ఉన్న లేపాక్షి భూముల సమస్యకు కూడా త్వరలోనే పరిష్కారం చూపిస్తాం. లక్షల కోట్ల రాష్ట్ర సంపద దోపిడీ కోసం.. అభివృద్ధికి అడ్డుకట్టవేశారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం గొడ్డలి పార్టీ అధినేతకు ఇష్టం లేదు. కేవలం నాకు పేరు వస్తుందనే అక్కసుతో ప్రతిదీ అడ్డుకోవాలని చూస్తున్నారు’’ అని చంద్రబాబు అన్నారు.







