రాయలసీమ న్యూస్, పొలిటికల్ డెస్క్:
ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన కమిటీల రద్దు: పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ నిర్మాణంపై కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో పార్టీ నాయకత్వంలో క్రమశిక్షణ లోపించడంపై, పార్టీ విధి విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు ఉన్న అన్ని కమిటీలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ ఓ అధికారిక ప్రకటన విడుదల చేశారు. పార్టీ మద్దతుదారులు, జనసైనికుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. జనసేన సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేసిన కార్యకర్తల లక్ష్యాలకు విరుద్ధంగా కొందరు నాయకుల ప్రవర్తన ఉందని, దీనిపై కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారని ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నాయకుల మధ్య విభేదాలు, సమన్వయ లోపం, క్రమశిక్షణ రాహిత్యం కారణంగా పార్టీ కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ పరిస్థితుల్లో పార్టీ వ్యవస్థను బలోపేతం చేయడం అత్యవసరమైందని, అందుకే ఉమ్మడి నెల్లూరు జిల్లా, నగర, మండల, గ్రామ స్థాయి కమిటీలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
జిల్లా సమన్వయ బాధ్యతలు నిర్వహిస్తున్నవారితో పాటు కమిటీల్లోని ఇతర సభ్యులను కూడా వారి బాధ్యతల నుంచి తప్పిస్తున్నట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు. క్రమశిక్షణ లేని చోట పార్టీ వ్యవస్థ సక్రమంగా నడవదని, అందుకే ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ వివరించినట్లు ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల ఉమ్మడి ప్రకాశం జిల్లా కమిటీని కూడా ఇలాంటి కారణాల వల్లే రద్దు చేసిన విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు. కొత్త కమిటీ నియామకం జరిగే వరకు ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ వ్యవహారాలను జనసేన కేంద్ర కార్యాలయం నేరుగా పర్యవేక్షిస్తుందని ఆయన ప్రకటించారు. జనసేనలో క్రమశిక్షణ, సమన్వయంపై రాజీ పడబోమనే సంకేతంగా పవన్ కల్యాణ్ ఈ నిర్ణయాన్ని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కొత్త కమిటీల ఏర్పాటు, నాయకత్వ పునర్వ్యవస్థీకరణపై జనసేన హైకమాండ్ త్వరలోనే స్పష్టత ఇవ్వొచ్చని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.







