ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ మరోసారి దీక్ష చేపట్టారు.. ప్రతి ఏడాది చేపట్టే ఆధ్యాత్మిక దీక్షను ఈసారి కూడా ప్రారంభించారు. మంగళగిరిలోని శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక అర్చనలు నిర్వహించి దీక్షను స్వీకరించారు. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో ప్రారంభమయ్యే ఈ దీక్షను కార్తీక మాసంలో విరమించడం పవన్ కల్యాణ్‌ ఆచారంగా కొనసాగిస్తున్నారు. గురుముఖత ద్వారా పొందిన మంత్రోపదేశాన్ని ఆచరణలో పెట్టేందుకు ఈ దీక్షను క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.

దీక్షా కాలంలో పవన్ కల్యాణ్‌ నియమిత జీవన విధానాన్ని పాటిస్తూ సాత్వికాహారాన్నే స్వీకరిస్తారు. విధి నిర్వహణకు అనుగుణంగా వస్త్రధారణ కొనసాగించినప్పటికీ, ఎక్కువగా చందన వర్ణ దుస్తులను ధరిస్తుంటారు. అలాగే ప్రతిరోజూ దేవతారాధన, అనుష్ఠానాలు, ధ్యానం, మంత్ర పారాయణం చేస్తూ ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమవుతారు.ప్రజా జీవితం, రాజకీయ బాధ్యతల మధ్య కూడా ఆధ్యాత్మిక సంప్రదాయాలను కొనసాగిస్తూ పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది ఈ దీక్షను చేపట్టడం విశేషంగా నిలుస్తోంది.